పెద్దపల్లిలో ఏండ్ల నుంచి సాగుతున్న పైప్ లైన్ పనులు

పెద్దపల్లిలో ఏండ్ల నుంచి సాగుతున్న పైప్ లైన్ పనులు

మిషన్ భగీరథ పైప్​లైన్​పనులు ఏండ్ల నుంచి కొనసాగుతుండడంతో పెద్దపల్లి జిల్లాలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. తెలంగాణ సర్కార్ ఫస్ట్ టర్మ్ నుంచే ఇంటింటికీ మంచినీరు సరఫరా చేస్తామని భగీరథ స్కీం తీసుకొచ్చింది. ఇప్పుడు సమస్య పరిష్కారం కాకపోవడంతో స్వచ్ఛంద సంఘాల సహాయంతో లీడర్లు పెద్దపల్లిలో బోరింగులు వేయిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలో మిషన్ భగీరథకు చెందిన ట్యాంకుల నిర్మాణం, ఇంటర్నల్ పైప్ లైన్ పనులు ఏండ్ల తరబడి నడుస్తూనే ఉన్నాయి. దీంతో ప్రజలు భగీరథ స్కీంపై ఆశలు వదులుకుంటున్నారు. 

ఏండ్ల సంది పనులు..

2016లో మిషన్ భగీరథ కింద ప్రభుత్వం పెద్దపల్లి పట్టణానికి రూ.34 కోట్లు కేటాయించింది. పట్టణంలో 118 కిలోమీటర్ల పైప్ లైన్ తోపాటు, 1200 కేఎల్, 2100 కేఎల్ కెపాసిటీతో రెండు ట్యాంకుల నిర్మాణం ప్రారంభించారు. 1200 కేఎల్ కెపాసిటీ ట్యాంకుకు రూ.1.78 కోట్లు, 2100 కేఎల్ కెపాసిటీ ట్యాంకుకు రూ.2.50 కోట్లు కేటాయించారు. ఈ రెండు ట్యాంకులు పూర్తయితే పెద్దపల్లి పట్టణానికి పూర్తిస్థాయిలో నీరు అందించొచ్చు. అయితే ఈ ట్యాంకుల నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ 2016లోనే భగీరథ పథకం ప్రారంభించి రాష్ట్రం మొత్తం తాగు నీరు ఇస్తానని, లేకపోతే 2018లో ఓట్లడుగనని ప్రామిస్ చేశారు. రెండోసారి ఎన్నికలొచ్చి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించారు. అయినా పెద్దపల్లిలో మాత్రం ఇప్పటికీ తాగునీరందడం లేదు. ఇంకా పట్టణంలో ఇంట్రో పైప్​లైన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ట్యాంకుల నిర్మాణం 60 శాతం కూడా పూర్తి కాలేదు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దపల్లి ఎంపీగా దివంగత వెంకటస్వామి, ఎమ్మెల్యేగా ముకుందరెడ్డి హయాంలో ఎల్లంపల్లి నుంచి నీటిని పైపుల ద్వారా తీసుకొచ్చి, బొంపెల్లిగుట్ట మీద సంపు ఏర్పాటు చేసి పెద్దపల్లి పట్టణానికి నీరు అందించే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అవే నీళ్లు పెద్దపల్లికి సప్లయ్ అవుతున్నాయి. అయినా పెరిగిన పట్టణానికి అనుగుణంగా నీరు సరిపోవడం లేదు. 

శాశ్వత పరిష్కారం లేనట్లేనా...

ప్రజా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడం సాధ్యంకాదని ప్రజాప్రతినిధులు డైరెక్టుగానే చెబుతున్నారు. ప్రభుత్వం ప్రతీ ఏటా నిర్వహించే పట్టణ ప్రగతిలో మంచినీరు, పారిశుధ్య సమస్యలను ప్రజలు నాయకుల ముందు పెడుతున్నారు. అధికారులు, నాయకులు రాసుకుని పోవడమే తప్ప పరిష్కారం చూపడం లేదు. ఇటీవల జరిగిన పట్టణ ప్రగతిలో ప్రజలు మంచినీటి సమస్యను ముందుకు తీసుకురావడంతో పెద్దపల్లి మున్సిపాలిటీ బోరింగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది కూడా ప్రభుత్వ ధనంతో కాదు, ఎవరైనా స్వచ్ఛంద సంఘాలు స్పాన్సర్ చేస్తే వేయిస్తున్నారు. ఇటీవల పట్టణంలోని 14, 17 వార్డుల్లో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రెండు బోరింగులు వేయించారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా భగీరథ నీళ్లివ్వాలని అడిగితే బోరింగులేయించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రామగుండం నియోజకవర్గంలో సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఆర్​ఓబీలను ఎమ్మెల్యే చందర్ శంకుస్థాపన చేశారు. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భగీరథ ఉండగా ఆర్వోబీలు ఎందుకని ప్రజలు సందేహిస్తున్నారు.

భగీరథ ఉన్నప్పుడు బోరింగులెందుకు?

భగీరథ స్కీం నడుస్తున్నప్పుడు మళ్లీ బోరింగులు ఎందుకు? ఇంటింటికి మంచినీళ్లు  ఇస్తామన్నరు. ఇప్పుడు స్వచ్ఛంద సంఘాల పేరు మీద బోరింగులు ఓపెన్ చేస్తున్నరు. భగీరథ స్కీం ఫెయిల్ అయింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ ఎత్తులు వేస్తున్నరు. బోరింగులు వేసి చేతులు దులుపుకోకుండా నీటి సమస్య శాశ్వత పరిష్కారం చూపాలె.
- తాడూరి శ్రీమాన్,  కాంగ్రెస్ లీడర్, పెద్దపల్లి