దేశంలో 50 శాతం ఆవాసాలకే నీటి సరఫరా

దేశంలో 50 శాతం ఆవాసాలకే నీటి సరఫరా

కేంద్రమంత్రులు ఢిల్లీలో అవార్డులు ఇస్తారు..గల్లీ అవాకులు పేలతారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు..గల్లీకొచ్చి..విమర్శిస్తారని మండిపడ్డారు. మిషన్ భగీరథ పథకానికి అవార్డులు ఇస్తున్న కేంద్రం..పైసలు కూడా ఇవ్వాలని కోరారు.  మిషన్ భగీరథ పథకాన్ని నీతి ఆయోగ్ సంస్థ ప్రశంసించిందని..రూ. 19 వేల కోట్ల నిధులు ఇవ్వాలని సూచించిందన్నారు. కానీ కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 15వ ఆర్థిక సంఘం మిషన్ భగీరథ నిర్వహణకు రూ. 5,300 కోట్ల నిధులు ఇవ్వాలని సూచించినా..కేంద్రం పట్టించుకోలేదన్నారు. 

తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతుంది
తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. జల్ జీవన్ పథకానికి మిషన్ భగీరథే ఆదర్శమని చెప్పారు. మిషన్ భగీరథను ప్రధాని మోడీయే మన్ కీ బాత్ లో ప్రశంసించారని గుర్తు చేశారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు మిషన్ భగీరథను మెచ్చుకున్నారని తెలిపారు. మిషన్ భగీరథ పథకాన్ని దేశంలోని అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ కంటే..మిషన్ భగీరథకే అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఈ అవార్డులే రాష్ట్ర పనితీరుకు నిదర్శమన్నారు. 

వందకు వంద శాతం నీటి సరఫరా
మిషన్ భగీరథ ఆలోచన ముఖ్యమంత్రిది...ఆచరణ ఇంజనీర్లదని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో మంచి నీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు నిరసనలు, ధర్నాలు చేశారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ వచ్చాక..తాగునీరు, విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. విద్యుత్ సమస్యను తీర్చడంతో పాటు..వ్యవసాయంతో పాటు..పరిశ్రమలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు చెప్పారు.  అలాగే మిషన్ భగీరథ ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. దేశంలో 50 శాతం గ్రామాలకు మాత్రమే నల్లాల ద్వారా మంచినీరు సరఫరా అవుతుంటే..తెలంగాణలో మాత్రం 54 లక్షల 6వేల ఇండ్లుంటే..అన్ని ఇండ్లకు నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రమని కేంద్రమే ప్రకటించిందని..అందుకు మిషన్ భగీరథే కారణమన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది భారీ  వర్షాలు కురిసినా..ఎక్కడా కూడా సీజనల్ వ్యాధులు ప్రబలేదన్నారు. అందుకు మిషన్ భగీరథ ఒక కారణమని తెలిపారు. 

సీఎం ఆలోచనతోనే అవార్డులు
దేశంలో తెలంగాణకు వచ్చిన అవార్డులు ఏ రాష్ట్రానికి రాలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తెలంగాణకు అవార్డులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అవార్డులు ప్రభుత్వ పనితీరుకు నిదర్శమని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు,  గొప్ప నిర్ణయాల వల్లే  ఇన్ని అవార్డులు వస్తున్నాయని తెలిపారు. గతంలో మంచినీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారని..కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. మిషన్ భగీరథకు మూడు సార్లు అవార్డులు వచ్చాయన్న మంత్రి ఎర్రబెల్లి... స్వచ్ఛ భారత్ కింద  తెలంగాణకు 7 అవార్డులు లభించాయన్నారు. ఇందులో నిజమాబాద్ కు 3 అవార్డులు వచ్చాయన్నారు. అవార్డులు ఇవ్వడమే కాదు..కేంద్రం నిధులు కూడా మంజూరు చేయాలని కోరారు.