ఏడాది నుంచి భగీరథ నీళ్లు ఫిల్టర్​ చేస్తలేరు

ఏడాది నుంచి భగీరథ నీళ్లు ఫిల్టర్​ చేస్తలేరు
  •     ఫ్లోరైడ్ ​పీడిత నల్గొండ జిల్లాలో సర్కారు తీరు
  •     ఏడాదిగా సాగుతున్న పంపుహౌస్​ రిపేర్లు  
  •     నెల నుంచి పని చేయని  ఫిల్టర్​ బెడ్లు  
  •     ఆలం, క్లోరిన్​ కలిపి డైరెక్ట్​గా  సప్లై చేస్తున్నరు
  •     మూడు నియోజకవర్గాలకు రెండు రోజులకోసారి నీళ్లు

నల్గొండ, వెలుగు:ఫ్లోరైడ్​ పీడిత నల్గొండ జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో ఏడాదిగా మిషన్​ భగీరథ నీళ్లను ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్​గా సరఫరా చేస్తున్నారు. రూల్స్​ ప్రకారం..ట్రీట్​మెంట్ ​ప్లాంట్లలో ఫిల్టర్ బెడ్లపైన బ్యాక్టీరియా, ఇతర మలినాలను తొలగించి సప్లై చేయాలి. కానీ ఏడాదిగా వాటర్ ట్రీట్​మెంట్ ప్లాంట్​ రిపేర్​లో ఉండడం, నెల కింద ఫిల్టర్​బెడ్లు కూడా దెబ్బతినడంతో  ఇలా చేయాల్సి వస్తోందని ఆఫీసర్లు చెబుతున్నారు.  

ఆలం, క్లోరిన్ కలిపి వదులుతున్నరు  

పానగల్లు ఉదయ సముద్రం రిజర్వాయర్​లోని ఇన్​టేక్​వెల్​ నుంచి రా వాటర్ పంపింగ్ చేసి వాటర్ ట్రీట్​మెంట్ ​ప్లాంట్​లోకి పంపిస్తారు. ఇక్కడ ప్రీ క్లోరినేషన్, పోస్ట్ క్లోరినేషన్ పద్ధతిలో నీటిని శుద్ధి చేశాక వాటర్ స్టోరేజీ సంప్ నుంచి గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తారు. అయితే ఏడాదిగా పంప్​హౌస్ ​రిపేర్లు నడుస్తుండడం, మరమ్మతుల వల్ల నెల రోజుల నుంచి ఫిల్టర్ ​బెడ్లు బంద్ ​చేయడంతో నీటి శుద్ధి ప్రక్రియ ఆగిపోయింది. బదులుగా ఆలం, క్లోరిన్ కలిపిన నీటినే స్టోరేజీ పంప్ నుంచి డైరెక్ట్​గా సరఫరా చేస్తున్నారు. నీటిలో కంటికి కనిపించని మలినాలను సాండ్ ఫిల్టర్​బెడ్స్​పైన తొలగించాల్సి ఉంటుంది.  కానీ, ఫిల్టర్ బెడ్ల రిపేర్లతో ఆలం, క్లోరిన్ కలిపిన నీటినే జనాలు తాగాల్సి వస్తోంది. అయినా తాగేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆర్​డబ్ల్యూఎస్​ ఆఫీసర్లు చెప్పడం లేదు.  

మూడు నియోజకవర్గాలకు ఇవే నీళ్లు...

పానగల్లులోని 59 ఎంఎల్​డీ( మిలియన్​ లీటర్స్​పర్​ డే) కెపాసిటీ ఉన్న ట్రీట్​మెంట్​ ప్లాంట్ నుంచే  మూడు నియోజవర్గాలకు నీటి సరఫరా జరుగుతోంది. నల్గొండ, మునుగోడు, నకిరేకల్​ నియోజకవర్గాల్లోని నల్గొండ మండలం, తిప్పర్తి, కనగల్, మునుగోడు, నార్కట్​పల్లి, చిట్యాల, రామన్నపేట వరకు ఈ ప్లాంట్ నుంచే నీటి సరఫరా చేస్తున్నారు. ఫ్లోరైడ్​ ప్రభావితమైన ఈ మండలాలకు నీటిని ఫిల్టర్ చేయకుండా సరఫరా చేస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ట్రీట్​మెంట్ ​ప్లాంట్​లోని మోటార్లు చెడిపోయి ఏడాది దాటినా ఇంకా రిపేర్లు చేస్తూనే ఉన్నారు. నెల నుంచి ఫిల్టర్​బెడ్లను కూడా రిపేర్ల పేరుతో మూసెయ్యడంతో ఇంకెంత కాలం ఇలా నడిపిస్తారో తెలియడం లేదు.  

అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం

భగీరథ నీటి సరఫరాలో ఆపరేషన్ అండ్ మేనేజ్​మెంట్​(ఓఅండ్ఎం) కాంట్రాక్టర్లదే కీలక పాత్ర. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు కావడంతోనే ఫిల్టర్ బెడ్లు, పంపుహౌస్​ పనుల్లో ఆలస్యమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాకాలంలోనే రిపేర్లు పూర్తి చేయాల్సి ఉన్నా ఎండాకాలం వచ్చినా కంప్లీట్​ చేయలేదు. దీనివల్ల గ్రామాల్లో ప్రస్తుతం తాగునీటి సమస్య ఎదురవుతోంది. ఫిల్టర్​బెడ్లు ప నిచేయకపోవడం వల్ల రెండు, మూడు రోజులకోసారి  నీటి సరఫరా జరుగుతోంది. రిపేర్లను సాకుగా చూపించి నీటి సరఫరా ఆపేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో ఫిల్టర్ చేయని నీటినే వదులుతున్నారు.  

ఫిల్టర్ బెడ్లు అవసరం లేదంట...

వాటర్ ట్రీట్​మెంట్​ ప్లాంట్​2005లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఫిల్టర్ చేసిన నీటినే గ్రామాలకు వదులుతున్నారు. కానీ ఇప్పుడు అధికారులు మాత్రం అసలు ఫిల్టర్ బెడ్లు అవసరం లేదని చెబుతున్నారు. ఆలం, క్లోరిన్ కలిపిన నీటిని డైరెక్ట్​గా వాడుకోవడం వల్ల ప్రమాదం లేదంటున్నారు.  ప్రతి రోజు టెస్టులు చేసే సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. కానీ ఎండాకాలంలో వచ్చే నీళ్లలో ఎక్కువ శాతం బ్యాక్టీరియా, ఇతర మలినాలు, బురద ఉంటాయని సరైన పద్ధతిలో క్లోరినేషన్ చేయకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని ఎక్స్​పర్ట్స్​అంటున్నారు.

రిపేర్లు చేయిస్తున్నాం 

59 ఎంఎల్​డీ ప్లాంట్ రిపేర్లు కొనసాగుతున్నాయి. ఫిల్టర్​బెడ్లు ఆపేశాం. త్వరలో పనులు కంప్లీట్ అవు తాయి. తాగునీటి సమస్య రావొద్దని వాటర్ సప్లై చేస్తున్నాం. 2005లో కట్టిన ప్లాంట్ కాబట్టి మోటార్లు రిపేర్ చేయడానికి టైం పడుతుంది. క్వాలిటీకి లోబడే వాటర్​ సప్లై చేస్తున్నాం. ఈనీటి వల్ల  ప్రజలకు ఎలాంటి హాని జరగదు.  
- వంశీకృష్ణ, గ్రిడ్ ఈఈ