- సరిపోను నీళ్లు రాక తిప్పలు
- మోహిన్మల్లలో బాలికకు సీరియస్
- కర్నూలు దవాఖానాకు తరలింపు
- తాటికుంటలో కలుషిత నీళ్ల కలకలం
గద్వాల, వెలుగు : మిషన్ భగీరథ నీళ్లు తాగి అస్వస్థతకు గురైన గద్వాల టౌన్ లోని వేదనగర్, గంటగేరి, మోహిన్ మల్లల్లో స్థానికులు సరిపోను నీళ్లు రాక కష్టాలు పడుతున్నారు. ఐదు రోజుల కింద మూడు కాలనీల్లో నీటి సరఫరాను అపేసిన అధికారులు అప్పటి నుంచి తాగడానికి మినరల్‌వాటర్‌ను, వాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సప్లై చేస్తున్నారు. ఆదివారం ఉదయం వేదనగర్, మోహిన్మల్లకు మిషన్‌భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించారు. కొంచం సేపు మాత్రమే వదలడంతో నీళ్లు సరిపోక ఇబ్బందులు పడ్డారు. మినరల్ వాటర్, ట్యాంకర్ల ద్వారా తగినంత నీటిని అందివ్వకపోవడంతో తండ్లాడాల్సి వచ్చింది. దీనిపై గద్వాల మున్సిపాలిటీ ఏఈ నితీశ్ రెడ్డి మాట్లాడుతూ మోహిన్ మల్ల, వేదనగర్ లకు నీటి సరఫరా చేశామని, గంటగేరికి కూడా సరఫరా చేస్తామన్నారు. మరోవైపు మోహిన్మల్లలో 14 ఏండ్ల బాలిక వాంతులు, విరేచనాలతో సీరియస్ కావడంతో కర్నూలు తరలించారు. ఆదివారం మరో నలుగురు గద్వాల ఏరియా దవాఖానాలో చేరారు. గద్వాలలో ప్రస్తుతం 40 మందికి పైగా చికిత్స పొందుతుండగా ప్రైవేటు హాస్పిటల్స్‌లో మరో 30 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
నీళ్లు తాగుతలేం..అందుకే తగ్గింది
ఐదు రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్ల సరఫరా నిలిపివేయడం...మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న మినరల్ వాటర్ తాగుతుండడంతో దవాఖానాల్లో చేరే బాధితుల సంఖ్య తగ్గిందని కాలనీవాసులు తెలిపారు. దీన్నిబట్టి కాలనీలో మిషన్ భగీరథ నీళ్లు కలుషితం కావడం వల్లే అస్వస్థతకు గురయ్యారనే విషయం స్పష్టమవుతోందన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదని మరింత ఎక్కువ సరఫరా చేయాలని కోరుతున్నారు. కాగా, మోహిన్ మల్ల కాలనీలో ఆదివారం కలుషిత నీరు సరఫరా అయ్యిందనే వార్త కలకలం రేపింది.
తాటికుంటలో కలుషిత మిషన్ భగీరథ నీళ్లు
మల్దకల్ మండలు తాటికుంటలో రెండు రోజుల నుంచి కలుషితమైన మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నల్లా నుంచి కలుషిత నీళ్లు వస్తున్న వీడియోలను మీడియాకు చూపించారు. రెండు రోజుల నుంచి మురుగు, డ్రైనేజీ కలిసిన నీళ్లను సరఫరా చేస్తున్నారని వాపోయారు. గ్రామంలో పైప్ లైన్ లీకేజీ వల్ల ఇలా జరిగిందని ఆఫీసర్లు తేల్చారు.
