అర్హత లేని లెక్చరర్లతో ఇంటర్ వ్యాల్యుయేషన్​

అర్హత లేని లెక్చరర్లతో  ఇంటర్ వ్యాల్యుయేషన్​

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఆన్సర్ షీట్ల వ్యాల్యుయేషన్​లో తప్పుల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నా, లోపాలు మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం రీవ్యాల్యుయేషన్, రీకౌంటింగ్ రిజల్ట్ ను ఇంటర్ బోర్డు రిలీజ్ చేయడంతో తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫస్టియర్ ఎకనామిక్స్ లో ఓ విద్యార్థికి జీరో మార్కులు రాగా, రీవ్యాల్యుయేషన్ లో44 మార్కులొచ్చాయి. తాజాగా ఇంగ్లిష్​లో 57 మార్కులు రాగా, రీవ్యాల్యుయేషన్​లో 92 మార్కులు వచ్చాయి. అర్హత లేని లెక్చరర్లతో వ్యాల్యుయేషన్ చేయించడంతో పాటు సిబ్బంది నిర్లక్ష్యంతో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. లెక్చరర్లు, అధికారులు, సిబ్బంది తప్పిదాలతో స్టూడెంట్లకు తిప్పలు తప్పడం లేదు. 

రీవ్యాల్యుయేషన్​లో ఇలా.. 

రంగారెడ్డి జిల్లాకు చెందిన సిద్ధేశ్వర్ రెడ్డి అనే ఫస్టియర్ స్టూడెంట్​కు ఎంపీసీలో 426 మార్కులొచ్చాయి. మ్యాథ్స్ ఏ, బీ పేపర్లలో, ఫిజిక్స్, కెమిస్ర్టీలో బైకి బై వచ్చాయి. సంస్కృతంలో 99 రాగా, ఇంగ్లిష్​ లో మాత్రం 57 మార్కులొచ్చాయి. దీంతో రీవ్యాల్యుయేషన్​కు అప్లై చేసుకోగా 92 మార్కులు వచ్చాయి. ఏకంగా 35 మార్కులు స్కోర్ అయ్యాయి. ఖమ్మం జిల్లాకు చెందిన గోపి అనే హెచ్ఈసీ విద్యార్థికి సెకండియర్​ ఎకానామిక్స్​లో 0 మార్కులు వేశారు. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు వచ్చి, ఈ ఒక్క సబ్జెక్టులో తక్కువ రావడంపై పేపర్లలో  వార్తలు వచ్చాయి. ఆ తర్వాత గోపి రీవ్యాల్యుయేషన్ చేయించగా.. 44 మార్కులు రావడంతో అతను పాస్ అయ్యాడని కొత్త మెమోను వెబ్​సైట్​లో పెట్టారు. రీవ్యాల్యుయేషన్​లో  ఇలా చాలామందికి 5–10 మార్కులు కలిసినట్టు లెక్చరర్లు, స్టూడెంట్లు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు ఏటా జరుగుతున్నా, ఇంటర్ బోర్డు మాత్రం మాములుగానే తీసుకుంటోంది.