ధరణిలో తప్పులు.. రైతులపై భారం

ధరణిలో తప్పులు.. రైతులపై భారం
  • ప్రతి దరఖాస్తుకు రూ.1,000 బాదుడు
  • ఇప్పటికే సర్వీస్​ చార్జీల మోత
  • ఇదేం పద్ధతి అంటున్న రైతులు
  • 4 లక్షల దాకా అప్లికేషన్లు వస్తాయని ఆఫీసర్ల అంచనా

హైదరాబాద్​, వెలుగు :  ధరణి  పోర్టల్​లో  కొత్త మాడ్యూల్​ కింద దరఖాస్తు పెట్టుకోవాలంటే ప్రభుత్వానికి రూ. 1,000 కట్టాల్సిందే. పట్టాదారు పాసుబుక్కులో చిన్న తప్పు వచ్చినా దాన్ని సరిదిద్దించుకోవాలంటే అంత మొత్తం చెల్లించాల్సిందే.  మొన్నటి దాకా బాధితులు కరెక్షన్ల కోసం నాలుగైదు సార్లు ధరణి పోర్టల్​లో దరఖాస్తులు పెట్టుకోవడం, పెట్టుకున్న ప్రతిసారీ సర్వీస్​ చార్జీలను చెల్లించాల్సి వచ్చేది. అయినా.. సమస్యలు పరిష్కారం కాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్​లో ప్రత్యేక మాడ్యూల్​ను తీసుకువచ్చింది. ఎనిమిది రకాల సవరణలకు ఇందులో అవకాశం కల్పించింది. అయితే.. వీటిలో ఏ ఒక్క దానికి అప్లయ్​చేసుకోవాలన్నా అప్లికేషన్​ ఫీజు కింద రూ. 1,000 చొప్పున ప్రభుత్వం వసూలు చేస్తున్నది. దీనికి సర్వీస్​ చార్జీ రూ. 11 అదనం. పైగా ఇంటర్నెట్​ చార్జ్​ కింద ఇంటర్నెట్​వాళ్లు మరో రూ. 100 తీసుకుంటున్నారు. మొత్తం డబ్బులు కట్టిన తర్వాతనే పట్టాదారు పాసుపుస్తకంలోని తప్పుల సవరణలకు అవకాశం ఇస్తున్నారు. సర్కార్ చేసిన సాంకేతిక తప్పులకు తమ నుంచి డబ్బులు గుంజడమేందని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

పాస్ బుక్ లో పేరు తప్పుగా పడితే మార్చుకోవడం, నేచర్ ఆఫ్ ల్యాండ్, క్లాస్లిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ లో ఏమైనా మార్పులు ఉంటే చేసుకునేందుకు మాడ్యూల్​లో అవకాశం కల్పించారు. అలాగే భూమి రకంలో మార్పులు, భూవిస్తీర్ణంలో హెచ్చుతగ్గులు ఉంటే సవరించడం, ఏవైనా సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్ మిస్సయితే చేర్చడం, నోషనల్ ఖాతా నుంచి పట్టా భూమిగా మార్చడం, భూమి అనుభవం(ఎంజాయ్మెంట్)లో మార్పులు వంటి వాటికి ప్రభుత్వం గురువారం నుంచి మాడ్యూల్​ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో దేనికి అప్లయ్​ చేసుకున్నా వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు. కొత్తగా వచ్చిన మాడ్యూల్​లో ఎనిమిది రకాల మార్పులకు దరఖాస్తు చేసుకోవచ్చని, వీటికింద  దాదాపు 3.50 లక్షల నుంచి 4 లక్షల అప్లికేషన్లు రావొచ్చని  ఆఫీసర్లు చెప్తున్నారు.