సింగరేణి జూనియర్​ అసిస్టెంట్​ పరీక్షల్లో చిత్రాలు

సింగరేణి జూనియర్​ అసిస్టెంట్​ పరీక్షల్లో చిత్రాలు

రిజల్ట్​ తప్పుడుతడకంటూ సోషల్​ మీడియాలో ఫైర్​​

మందమర్రి, వెలుగు: ఇటీవల సింగరేణి సంస్థలో జూనియర్​అసిస్టెంట్​పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో ‘తెలంగాణ’, ‘ఆంధ్రప్రదేశ్’​  అనే స్టూడెంట్లకు సైతం మార్కులు వచ్చాయి. సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన ఫలితాల్లో ఈ రెండు రాష్ట్రాల పేర్లు కూడా క్వాలిఫై అయ్యాయి. రిజల్ట్ లో రాష్ట్రాలు, ఇతర పేర్లు రావడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. తప్పులతడకగా ఉన్న రిజల్ట్​వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సింగరేణి సంస్థలో 177 పోస్టుల భర్తీ కోసం ఈ నెల 4న  ఎనిమిది జిల్లాల్లో 187 సెంటర్లలో  పరీక్ష నిర్వహించారు. 77,898 మంది పరీక్ష  రాశారు. శనివారం పరీక్ష ఫలితాలను రిలీజ్​చేశారు.  పరీక్షల్లో 49,398 మంది అర్హత సాధించినట్లు  జెన్టీయూహెచ్​ డైరెక్టర్​ విజయ్​కుమార్​రెడ్డి, సింగరేణి డైరెక్టర్​ (పా, ఆపరేషన్స్​) చంద్రశేఖర్​ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. జూనియర్​అసిస్టెంట్​పోస్టుల విషయంలో మొదటి నుంచి పైరవీకారుల దందా ఉందని, పెద్ద మొత్తంలో అభ్యర్థుల నుంచి దండుకున్నారని ప్రచారం జరిగింది. ఏకంగా మంచిర్యాలకు చెందిన ఒక స్టడీ సెంటర్​ నిర్వాహకుడు అభ్యర్థులను గోవాకు తీసుకువెళ్లి పేపర్​లీక్​ చేశాడని కూడా జోరు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని సింగరేణి యాజమాన్యం కొట్టిపారేసింది. ఎలాంటి అవకతవకలు జరుగలేదని పేర్కొంది. ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తుండగా శనివారం సాయంత్రం పొద్దుపోయాక రిలీజ్​చేశారు. తాజాగా రిలీజ్​ చేసిన ఫలితాల్లో అభ్యర్థుల పేర్లకు బదులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, డిగ్రీ అంటూ వచ్చాయి. తెలంగాణ పేరుపై లోకల్​అభ్యర్థి, 52.710 మార్కులు, 4026 ర్యాంకు,  ఆంధ్రప్రదేశ్​ పేరుపై 28.960 మార్కులు, నాన్​లోకల్, 31,187 ర్యాంకు,  డిగ్రీ పేరుపై  ఫిమేల్​27. 290 మార్కులు, 34,172 ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. హాల్​టికెట్​లో సైతం తెలంగాణ అనే పేరు ఉండగా కింద సంతకం శ్రీధర్​అని ఉంది. ఆంధ్రప్రదేశ్​హాల్​టికెట్​పై మణికంఠ, డిగ్రీ హాల్​టికెట్​పై లలిత అని సంతకాలు ఉన్నాయి. పరీక్ష సమయంలో అటువంటి పేరు కలిగిన వారి పత్రాలను పరిశీలించకుండా ఇన్విజిలేటర్లు, నిర్వాహకులు  ఏ విధంగా పరీక్ష రాసేందుకు అనుమతించారని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థుల బదులు రాష్ట్రాలు, ఇతర పేర్లు రావడం ఆఫీసర్ల నిర్లక్ష్యానికి నిలువుటద్దమని పలువురు సోషల్​ మీడియాలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. 

ఎంక్వైరీ చేయాలె..

రామకృష్ణాపూర్: సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఫలితాలు, కీ పేపర్లలో తప్పులు వచ్చాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రామగిరి రామస్వామి ఆరోపించారు. ఆదివారం రామకృష్ణాపూర్​లోని యూనియన్​ఆఫీస్​లో మీడియా సమావేశంలో మాట్లాడారు. జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో సీల్​ లేకుండా ప్రశ్నాపత్రాలు రావడమే కాకుండా, కీలో తప్పులు దొర్లాయన్నారు. క్వాలిఫై కాని వారి మార్కులు విడుదల చేయలేదని, ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాలని డిమాండ్​ చేశారు. జేఎన్టీయూహెచ్, సింగరేణి యాజమాన్యం సంయుక్తంగా విడుదల చేసిన పరీక్ష ఫలితాల్లో కూడా అభ్యర్థుల పేర్లు  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, డిగ్రీ అంటూ రావడంపై వివరణ ఇవ్వాలన్నారు. కంపెనీలో ఇంటర్నల్​ పరీక్షల తేదీని వెంటనే ప్రకటించాలన్నారు. సింగరేణి మొండివైఖరి కారణంగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కాంట్రాక్ట్​ కార్మికుల సమ్మె ఉత్పన్నమైందన్నారు. సింగరేణి సంస్థ గతయేడాది ఆర్జించిన వాస్తవ లాభాలను ప్రకటించాలని డిమాండ్​ చేశారు.