IPL 2024: ఢిల్లీకి ఎదురు దెబ్బలు.. ముంబైతో మ్యాచ్‌కు ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్

IPL 2024: ఢిల్లీకి ఎదురు దెబ్బలు.. ముంబైతో మ్యాచ్‌కు ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఔట్

ఐపీఎల్ సీజన్ లో ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు కుల్దీప్ యాదవ్, మిచెల్ మార్ష్ ఇద్దరు గాయాల బారిన పడ్డారు. తొడ కండరాల గాయంతో కుల్దీప్ చివరి రెండు మ్యాచ్ లు ఆడని సంగతి తెలిసిందే. అతనికి రెస్ట్ అవసరమని ఢిల్లీ యాజమాన్యం భావించింది. తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్  మిచెల్ మార్ష్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని ఢిల్లీ టీం డైరెక్టర్ సౌరవ్ గంగూలీ స్వయంగా ధృవీకరించారు. 

మార్ష్ గాయపడినట్టు తెలిపినా.. గాయం ఎలాంటి గాయం అనే విషయంపై గంగూలీ స్పష్టత ఇవ్వలేదు. ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ఎప్పుడు కోలుకుంటాడో కూడా చెప్పలేదు. దీంతో ఆదివారం (ఏప్రిల్ 7) ముంబై ఇండియన్స్ తో జరగబోయే మ్యాచ్ కు మార్ష్ తో పాటు కుల్దీప్ యాదవ్ దూరం కానున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. మార్ష్ స్థానంలో ఆసీస్ చిచ్చర పిడుగు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తుది జట్టులో ఆడే అవకాశం కనిపిస్తుంది. 

మార్ష్ ఇప్పటివరకు ఐపీఎల్ లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. నాలుగు మ్యాచ్ ల్లో 71 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన ఈ ఆసీస్ వీరుడు ఆ జట్టుకు భారంగా మారాడు. అయితే ముంబై లాంటి కీలక మ్యాచ్ కు దూరం కావడంతో ఢిల్లీకి గట్టి ఎదురు దెబ్బ తగలనుంది. ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి.  ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ లోనే విజయం సాధించింది. వైజాగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో విజయం సాధించిన ఢిల్లీ..  మిగిలిన మ్యాచ్ ల్లో ఓడిపోయింది.