IPL 2024 Final: ఐపీఎల్ ఎఫెక్ట్.. వన్డేలకు మిచెల్ స్టార్క్ గుడ్ బై..?

IPL 2024 Final: ఐపీఎల్ ఎఫెక్ట్.. వన్డేలకు మిచెల్ స్టార్క్ గుడ్ బై..?

ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్  బౌలర్ మిచెల్ స్టార్క్ దేశానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనవరసం లేదు. 2023 టెస్ట్ ఛాంపియన్ షిప్ ఉండడంతో ఐపీఎల్ ఐపీఎల్ ఆడనని తేల్చి చెప్పేశాడు. చాలా సందర్భాల్లో దేశానికే నా తొలి ప్రాధాన్యత అని స్టార్క్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఏడాది జూన్ నుంచి టీ20వరల్డ్ కప్ ఉండడంతో ఈ సీజన్ ఐపీఎల్ ప్రాక్టీస్ గా ఉపయోగించుకుందామనుకున్న స్టార్క్ ఈ మెగా లీగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

వేలంలోకి రాగానే స్టార్క్ కు ఊహించని ధర పలికింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ ఆసీస్ బౌలర్ కోసం రికార్డ్ స్థాయిలో రూ. 24. 75 కోట్లు వెచ్చించి అతన్ని వేలంలో దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యధిక ధర కావడం విశేషం. ఐపీఎల్ లీగ్ దశలో దారుణంగా విఫలమైన స్టార్క్.. నాకౌట్ మ్యాచ్ ల్లో తనలోని అత్యుత్తమ ఆటతీరును బయటపెట్టాడు. సన్ రైజర్స్ తో జరిగిన క్వాలిఫయర్ 1, ఫైనల్లో టాప్ బౌలింగ్ తో కేకేఆర్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు మ్యాచ్ ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్టార్క్ కావడం విశేషం. ఈ మ్యాచ్ తర్వాత తన కెరీర్ గురించి స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"నా కెరీర్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. త్వరలో ఒక ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. వన్డే వరల్డ్ కప్ కు ఇంకా చాలా సమయం ఉంది. వన్డే వరల్డ్ కప్ 2027 ఆడతానో లేదో చెప్పలేను. బహుశా నేను ఫ్రాంచైజీ క్రికెట్ ఎక్కువగా ఆడొచ్చు". అని స్టార్క్ తన వన్డే రిటైర్మెంట్ గురించి ఒక హింట్ ఇచ్చాడు. ఏ ఫార్మాట్ అనే విషయం అధికారికంగా చెప్పకపోయినా స్టార్క్ మాటలను చూస్తుంటే  వన్డేలకు అని స్పష్టంగా అర్ధమవుతుంది.