ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మిథున్ చక్రవర్తి ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మిథున్ చక్రవర్తి దత్తపుత్రిక దిశానీ చక్రవర్తి నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని దిశానీ సోమవారం జూన్ 15న తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది.
ఈ సందర్భంగా దిశానీ ‘లవ్ కం పెళ్లి ప్రపోజల్‌కు’ సంబంధించిన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. తన ప్రియుడు మైల్స్ మాంట్జారిస్‌తో జరిగిన ఎంగేజ్ మెంట్ ఫొటోలను పంచుకుంటూ కాబోయేవాడ్ని పరిచయం చేసింది. ‘06.12.2026.. నా జీవితంలో నేను అంగీకరించిన అత్యంత అందమైన శాశ్వత బంధం’ అంటూ దిశానీ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోల్లో దిశానీ తెలుపు రంగు కార్సెట్ డ్రెస్‌లో మెరిసిపోగా, తన ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని అభిమానులకు చూపించింది.
మరోవైపు మైల్స్ మాంట్జారిస్ ముదురు రంగు షర్ట్, గ్రే రంగు ప్యాంట్ ధరించి కనిపించాడు. అలాగే మోకాళ్లపై కూర్చుని దిశానీకి ప్రపోజ్ చేస్తున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సినీ స్టార్స్, ఆమె అభిమానులు కొత్త జంటకు విషెస్ తెలుపుతున్నారు. ఈ జోడీ డిసెంబర్ 6, 2026న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇకపోతే మిథున్ చక్రవర్తి ‘గోపాల గోపాల’ సినిమాలో విలన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు.
దిశాని చక్రవర్తి సినిమాలు:
హాలీవుడ్ చిత్రంతో దిశాని చక్రవర్తి తన సినీ ఎంట్రీ ఇచ్చింది. ఆమె 2017లో విడుదలైన తన షార్ట్ ఫిల్మ్ ‘గిఫ్ట్’తో హాలీవుడ్‌లో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలతో బాలీవుడ్లో రాణిస్తుంది. ‘హోలీ స్మోక్’, ‘అండర్‌పాస్’, ‘వై డిడ్ యు డూ ఇట్’, ‘టూ ఫేస్డ్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దిషాని చివరిసారిగా 2022లో ‘ది గెస్ట్’ అనే లఘు చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటిగా, రచయితగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
చెత్త డబ్బాలో దొరికిన చిన్నారే.. స్టార్ దిశానీ
నటుడు మిథున్ చక్రవర్తి, యోగితా బాలి దంపతుల దత్తపుత్రిక దిశానీ చక్రవర్తి గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయం ఉంది. కోల్‌కతాలో పుట్టిన దిశానీని ఆమె జన్మించిన వెంటనే కుటుంబ సభ్యులు చెత్త కుప్ప వద్ద వదిలివేయగా, ఈ ఘటన అప్పట్లో వార్తల్లో నిలిచింది. ఆ వార్త చదివిన మిథున్ చక్రవర్తి, భార్య యోగితా బాలితో చర్చించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చిన్నారిని దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి దిశానీ కుటుంబంలో అందరికీ ఎంతో ఆప్తురాలిగా మారింది.
మిథున్ చక్రవర్తి గురించి:
భారతీయ సినీ ప్రేక్షకులకు డిస్కో డ్యాన్సర్ గా చేరువయ్యారు మిథున్ చక్రవర్తి. ఈయనను డిస్కో కింగ్ అని కూడా పిలుస్తారు. ఐదు దశాబ్దాల పాటు తన కెరీర్‌లో 350 కి పైగా సినిమాలు చేశారు. మొదటి సినిమాకే నేషనల్ అవార్డ్ అందుకున్నారు మిథున్ చక్రవర్తి. అలా ఆయన కెరీర్‌లో మొత్తం మూడు నేషనల్ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే మిథున్ చక్రవర్తి, యోగితా బాలి దంపతులకు ముగ్గురు కుమారులు మహాక్షయ్, ఉష్మే , నమాషి. ఈ ముగ్గురు అన్నదమ్ములకు ముద్దుల చెల్లిగా దిశా అడుగుపెట్టింది.
