
- వారిని త్వరలో విచారించనున్న మియాపూర్పోలీసులు
మియాపూర్, వెలుగు: మియాపూర్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా నిందితుల జాబితాలో యాప్ లను నిర్వహించే19 మంది పేర్లను చేర్చారు. త్వరలోనే వీరికి నోటీసులు జారీ చేసి విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల19న బెట్టింగ్యాప్స్ ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలతో పలువురు సినీ ప్రముఖులపై ఓ వ్యక్తి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు 25 మంది యుట్యూబర్లు, సినీ ప్రముఖలపై కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితులలో సినీ నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహా పాతన్, పద్దు పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్షాసాయి, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు శేషయాని, సుప్రిత ఉన్నారు. వీరందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా బెట్టింగ్యాప్స్ నిర్వాహకులు19 మందిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు.
ఇందులో ఏ23, జిగిల్ రమ్మీ డాట్ కామ్, యోలో 247, ఫెయిర్ ప్లే, జీత్ విన్, వి బుక్, తాజ్ 77, ధని బుక్ 365, మామ 247, తెలుగు 365, ఎస్ 365, జె 365, జెట్ ఎక్స్, ప్యారీ మ్యాచ్, తాజ్ 777 బుక్, ఆంధ్రా 365 యాప్ ల నిర్వాహకులు ఉన్నారు. నిర్వాహకులు తమ యాప్స్‌ని ప్రమోట్‌చేసిన యూట్యూబర్లకు, సినీ ప్రముఖులకు ఎంత డబ్బు చెల్లించారు ? ఏ విధంగా చెల్లించారనే విషయాలపై విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. యాప్స్‌ను ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు.