- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
నేరడిగొండ, వెలుగు: గ్రామస్తులంతా ఐకమత్యంతో ఉంటే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని వాగ్దారి గ్రామంలో రూ.5 లక్షలతో కొత్తగా కమిటీ హాల్ నిర్మాణం, గుస్సాడీ దండోరా షెడ్డు, ప్రైమరీ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు ఆదివారం ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐకమత్యంతో ఉంటే అన్ని సాధించుకోవచ్చని, గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం మండల కేంద్రంలో పునరుద్ధరించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, కొత్త సర్పంచ్ ఏలేటి నీలిమ రవీందర్ రెడ్డిని సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో వాగ్దారి సర్పంచ్ జాదవ్ విజయ్, ఉప సర్పంచ్ సోయం లక్ష్మణ్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, దేవేందర్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
