నాలా మీద కట్టిన ఎమ్మెల్యే ఆఫీస్‍ కూల్చిన్రు

నాలా మీద కట్టిన ఎమ్మెల్యే ఆఫీస్‍ కూల్చిన్రు
  • ఆరూరి రమేశ్ ఇంటికి పది రోజుల కిందే మార్కింగ్‍
  • రెస్పాండ్ కాకపోవడంతో కూల్చేసిన
  • వరంగల్ కార్పొరేషన్​ ఆఫీసర్లు

వరంగల్‍ రూరల్‍, వెలుగు: నాలాకు అడ్డుగా ఉండి, వరంగల్ సిటీలోని పలు కాలనీల ముంపునకు కారణమవుతున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‍ క్యాంప్​ ఆఫీస్​ను గ్రేటర్‍ వరంగల్​ మున్సిపల్‍ సిబ్బంది బుధవారం కూల్చేశారు. గత నెలలో సిటీలో వానలు దంచికొట్టడంతో వరదనీరు 120 కాలనీలను ముంచెత్తింది. ఆ టైంలో సిటీలో పర్యటించిన మంత్రి కేటీఆర్‍.. నాలాలపై ఆక్రమణలను 15 రోజుల్లో తొలగించాలని, కలెక్టర్‍ ఆధ్వర్యంలోని టాస్క్​ఫోర్స్​కు ఫుల్‍ పవర్స్​ఇస్తున్నామని చెప్పారు.నాలాల ఆక్రమణ, చెరువులు మాయం, కాలనీల్లో ఇంటర్నల్‍ డ్రైనేజీ సిస్టం లేక వరద ముంచెత్తుతోందని ‘వానొస్తే వణుకుతున్న వరంగల్‍’పేరుతో, నాలాలపై టీఆర్‍ఎస్‍ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వారి అనుచరుల అక్రమ ఇండ్లపై ‘నాలాలపైనే లీడర్ల ఇండ్లు.. చర్యలకు వెనుకాడుతున్న ఆఫీసర్లు’పేరుతో ‘వెలుగు’లో వార్తలు పబ్లిష్ అయ్యాయి.

పది రోజుల క్రితమే మార్కింగ్

దీంతో స్పందించిన టాస్క్​ఫోర్స్​ చైర్మన్‍, వైస్‍ చైర్మన్‍గా ఉన్న కలెక్టర్‍ రాజీవ్‍గాంధీ హన్మంతు, గ్రేటర్‍ కమిషనర్‍ పమేలా సత్పతి.. ఆక్రమణల తొలగింపులో అందరికీ ఒకటే న్యాయమని, కబ్జాలు ఉంటే కూల్చివేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే రమేశ్​ వివరణ ఇస్తూ.. క్యాంప్‍ ఆఫీస్‍ స్థలాన్ని తాను ఆక్రమించలేదని, పట్టా కాగితాలు ఉన్నాయని చెప్పారు. ఒకవేళ నాలా ప్రవాహానికి తన ఇల్లు అడ్డుగా ఉంటే కూల్చివేతకు రెడీ అన్నారు. ఈ క్రమంలో టాస్క్​ఫోర్స్​ టీమ్​ ఎంక్వైరీ చేసి..10 రోజుల క్రితమే ఆఫీస్‍కు మార్కింగ్‍ పెట్టింది. సొంతంగా తొలగించుకోవాలని, లేదంటే తామే కూల్చివేయాల్సి ఉంటుందని చెప్పింది. అయినా స్పందించకపోవడంతో బుధవారం హంటర్​ రోడ్డులోని ఆఫీస్‍ ను కూల్చివేశారు. మొదట ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. టాస్క్​ఫోర్స్​ ఆదేశాలతోనే కూల్చివేస్తున్నామని, అడ్డుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు.