ధర్మారెడ్డి మన టార్గెట్ కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్నే కూల్చేయాలి

ధర్మారెడ్డి మన టార్గెట్ కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్నే కూల్చేయాలి
  • ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్

హైదరాబాద్: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మన టార్గెట్ కాదు..  కేసీఆర్ ప్రభుత్వాన్నే కూల్చేయాలి.. రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచే తొలగించిన కేసీఆర్, ధర్మారెడ్డిని ఎందుకు తొలగించరు..? ఉత్తమ్, రేవంత్, కోదండరాం, చాడ వెంకట్ రెడ్డిలు ఎందుకు ప్రశ్నించరు.. ? బహుజనుల ఓట్లు అవసరం లేదా.. ?? అంటూ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు. అరాచకాలు సహించరానివి.. ఏప్రిల్ 14న నా ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ  ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సారధ్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎస్సిీ,ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. బహుజన ఉద్యోగుల మనోభావాలను దెబ్బసిన చల్లా ధర్మారెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించడం తోపాటు, ఎస్సిీ, ఎస్టీ, పి.ఒ యాక్ట్ కింద కేసు బుక్ చేయాలని సమావేశం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యే గా ఎన్నిక కాకముందు ధర్మారెడ్డి సంపాదన ఎంత? ఇప్పుడెంత..?  వాస్తవ గణాంకాలు చెప్పే దమ్ము ఉందా..? నీ సంపాదన అంతా సక్రమమేనా..?? బహుజన సమాజానికి ఏ రంగంలో ప్రాతినిధ్యంలేదు.. బహుజనులు అక్రమంగా సంపాదించింది ఎంతో చల్లా ధర్మారెడ్డి చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. సంపద దోపిడీ చేసింది మీరు(అగ్రవర్ణాలు) కాదా..? రోడ్లు ఊడ్చేపని, పాకీ పని తప్ప మా బిడ్డలు ఎక్కడున్నారు..?  చేసిన పనికి సరైన జీతాలు కూడా చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలువుదోపిడి చేస్తున్నాయి.. మీ కులాల నుంచి ప్రపంచ మేధావి ఎవరైనా ఉన్నారా.. ? మా సామాజిక వర్గం నుంచి అంబేడ్కర్ ఉన్నాడు.. బహుజనులపై జరుగుతున్న దోపిడిపై చల్లా ధర్మారెడ్డి చర్చకు రావాలి..’’ అని ఆయన కోరారు. మంత్రివర్గంలో 93 శాతం ఉన్నవారి ప్రాతినిధ్యం ఐదుగురు ఉంటే, అగ్రవర్ణాలు యెంత మంది ఉన్నారో తెల్వదా.. ? ఒక్క శాతం కూడా లేని వెలమ సామాజికవర్గం నుంచి ముఖ్యమంత్రి పదవితోపాటు, నలుగురు మంత్రులున్నారు.. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆరుగురు మంత్రులున్నారు.  ఇలా రాష్ట్రంలో మొత్తం అగ్రవర్ణాలదే రాజ్యం..’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

బీసీ అయిన ఈటెల సీఎం అయితే తప్పేంటి..?

ఎమ్మెల్యే అయినంత మాత్రాన చట్టం వర్తించదా? చట్టం ముందు అందరూ సమానమే అనేది బడుగు బలహీన వర్గాలకే వర్తిస్తుందా? అగ్రవర్ణాలకు వర్తించదా? కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ బిసి మంత్రితోనే చెప్పిస్తారు.. ఏం.. బిసి అయిన ఈటెల ముఖ్యమంత్రి అయితే తప్పేంటి..’’ అని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ నిలదీశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పై వ్యక్తిగత శత్రుత్వం లేదు.. జీరో ఎఫ్ ఐ ఆర్ ప్రకారం ఓయూ పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదు చేసే అవకాశం ఉన్నా.. ఘటన జరిగిన వరంగల్ లోనే కేసు నమోదు చేయాలని పోలీసులు చెప్పారు.. రాజ్యాంగ బద్దంగా రిజర్వేషన్లతో బాగుపడ్డ అందరినీ చల్లా ధర్మారెడ్డి తిట్టాడు.. దళిత జాతికి గాంధీ తీవ్ర అన్యాయం చేసారు.. ఇంట్లో పడుకున్న మన సమాజాన్ని నిద్ర లేపడనికే ఈ రౌండ్ టేబుల్ సమావేశం.. రాజ్యాంగం, రిజర్వేషన్లు తెలుసుకోకుండా బానిసలుగా మాత్రమే మనం మిగిలిపోతున్నాం.. రిజర్వేషన్లు ఎలా వచ్చాయో తెలుసుకోకుండా అగ్రవర్ణాలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు.. రాజకీయ అవకాశాల్లోనే 10 ఏళ్లు రిజర్వేషన్లు కల్పించారు తప్ప విద్య ఉద్యోగ అవకాశాల్లో కాదు.. రాజ్యాంగాన్ని రక్షిస్తూ, ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డిని బర్తరఫ్ చేయాలని స్పీకర్‌ని ఆదేశించాలంటూ గవర్నర్‌ను కలుస్తాం.. డీజీపీని కలిసి చల్లా ధర్మారెడ్డి పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరతాం.. ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉల్లంఘనకు పాల్పడిన చల్లా ధర్మారెడ్డి ని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలంటూ స్పీకర్ ని కలిసి విజ్ఞప్తి చేస్తాం..’’ అని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

రైతుల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త.. సచిన్‌కు పవార్ చురకలు!

కిలాడీ మహిళల చిలిపి దొంగతనం

సీసీ కెమెరాకు చూపించి మరీ.. లంచం తీసుకుంది

ప్రభుత్వాసుపత్రిలో అరుదైన సర్జరీ:  నుజ్జునుజ్జయిన చేతిని అతికించారు