నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీనే గ్రేటర్ ఎన్నికల్లో గెలుస్తుందని.. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో నాకేం తెలుస్తుంది.. నాకు తెలియదంటూ స్పష్టం చేశారాయన. 2025, డిసెంబర్ 24వ తేదీ హైదరాబాద్ సిటీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పిన దానం నాగేందర్.. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుందంటూ స్పష్టం చేశారాయన. MIM పార్టీతో కలుపుకుని కాంగ్రెస్ పార్టీ 300 డివిజన్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు దానం.
జీహెచ్ఎంసీని.. ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించటం వల్ల హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని.. సిటీ విస్తరణ కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అవుతుందన్నారాయన. కాంగ్రెస్ పార్టీ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరిస్తానని.. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు దానం.
వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోని జహీరానగర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దానం.. అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనులకు 4 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారాయన. హైదరాబాద్ సిటీ అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటే ప్రజలంతా ఉన్నారని.. ఇందుకు జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఎన్నికలే నిదర్శనం అన్నారాయన.
