బస్తీ దవాఖానాలు, యూపీహెచ్సీలతో ప్రజలకు చేరువగా వైద్యం : దానం నాగేందర్

బస్తీ దవాఖానాలు, యూపీహెచ్సీలతో ప్రజలకు చేరువగా వైద్యం : దానం నాగేందర్

రోజురోజుకు విస్తరిస్తున్న క్యాన్సర్ లాంటి వ్యాధులను ముందస్తుగానే గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్క్రీనింగ్ పరీక్షలను చేస్తోందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన  కోరారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బస్తి దవాఖానలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్సీ) ను బస్తీలలో ఏర్పాటు చేసి.. ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించారని తెలిపారు. ఖైరతాబాద్ రాజ్ నగర్ బస్తీలో ఏర్పాటు చేసిన క్యాటరాక్ట్ కంటి స్క్రీనింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆశావర్కర్స్, ఏఎన్ఎమ్ లకు స్థానిక కార్పొరేటర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులతో కలిసి దానం చీరలు పంపిణీ చేశారు.

 తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్యశాఖకు పెద్దపీట వేశారని దానం నాగేందర్ తెలిపారు. బస్తీలో నివాసం ఉంటున్న ప్రజలు బయటకు పోకుండా బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి అన్ని వైద్య పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కంటి చూపు కోల్పోయిన వృద్దులకు ఇంటివద్దకే ఆశావర్కర్లు వచ్చి వారిని ఆసుపత్రికి తీసుకెళ్తారు. వారికి కావాల్సిన అన్ని వైద్య పరీక్షలు చేయించి ఇంటివద్దనే వదిలిపెడుతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి పేదవాడికి వైద్యం అందించాలన్న లక్ష్యంతో.. సీఎం కేసీఆర్ వైద్యశాఖలో హెల్త్ ప్రొఫైల్ ఏర్పాటు చేసి పెనుమార్పులు తీసుకురాబోతున్నారని దానం నాగేందర్ స్పష్టం చేశారు.