ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్

న్యూఢిల్లీ, వెలుగు: బెల్లంపల్లి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు షేజల్ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ను ఢిల్లీ పోలీసులు రికార్డు చేశారు. ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్‌‌‌‌లో చికిత్స పొందుతున్న షేజల్ స్పృహలోకి రావడంతో ఆమె నుంచి శనివారం వాంగ్మూలం తీసుకున్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తనను లైగింకంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు ఆమె స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చింది. వాళ్లకు వ్యతిరేకంగా ఢిల్లీలో తాను చేస్తోన్న ఆందోళనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని, వాటి వల్లే తాను మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు వాగ్మూలం ఇచ్చింది. చిన్నయ్య, ఆయన అనుచరుల పేర్లు, వివరాలను అందులో ప్రస్తావించింది. షేజల్‌‌‌‌ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగా పోలీసులు ఎమ్మెల్యే చిన్నయ్య, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటోందని, మరో 48 గంటలు ఆమెను అబ్జర్వేషన్‌‌‌‌లో ఉంచుతామని డాక్టర్లు తెలిపారు. ఊపిరితిత్తులు, తీవ్రమైన తల నొప్పితో షేజల్ బాధపడుతున్నదని ఆమె సహాయకులు తెలిపారుమెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌కు తరలించాలని భావిస్తున్నా.. ప్రాణభయంతో ఆమె వెళ్లడం లేదన్నారు.

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను అరెస్ట్ చేయాలి

బషీర్ బాగ్, వెలుగు: అరిజిన్ డెయిరీ సీఈవో షేజల్​ను వేధింపులకు గురిచేస్తున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను అరెస్ట్ చేయాలని టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన డీజీపీ అంజనీకుమార్​కు ఫిర్యాదు చేశారు. 3 నెలలుగా ఎమ్మెల్యే, అతని అనుచరులు మానసికంగా, భౌతికంగా వేధించడంతో  షేజల్ ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు పెద్దపీట వేశామని సీఎం గొప్పలు చెప్పారని.. కానీ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉందన్నారు. ఓ యువతి ఎమ్మెల్యే నుంచి తనకు రక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నా పోలీసులు, మహిళ కమిషన్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.