సారంగాపూర్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసం భారీగా నిధులు కేటాయిస్తోందని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం సారంగాపూర్ మండలంలోని జాం, నాగపూర్ గ్రామాల్లో పర్యటించి రూ.90 లక్షల విలువైన అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. జాం గ్రామంలోని కేజీబీవీలో రూ.38 లక్షలతో చేపట్టనున్న అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించారు. నాగపూర్ లో రూ.52 లక్షల ఉపాధి హామీ నిధులతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు.
ఆ నిధుల్లోని రూ.20 లక్షలతో అధునాతన గ్రామపంచాయతీ భవనం, రూ.12 లక్షలతో అంగన్‌వాడీ కేంద్రం, మరో రూ.20 లక్షలతో మహిళా సంఘం భవనం, సర్వే షెడ్ నిర్మించనున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గోదాములు వంటి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు కాల్వ నరేశ్, జాం, నాగపూర్ సర్పంచులు కరిపే రవళి, లలిత బాయి, సీనియర్ నేతలు రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, సత్యం చంద్రకాంత్, కరిపే విలాస్ తదితరులు పాల్గొన్నారు.
