కేసీఆర్.. ధనిక రాష్ట్రం అంటవ్, ధాన్యం ఎందుకు కొనవ్?

కేసీఆర్.. ధనిక రాష్ట్రం అంటవ్, ధాన్యం ఎందుకు కొనవ్?

చౌటుప్పల్: హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ లో అసహనం పెరిగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆ అసహనాన్ని రైతులపై చూపుతున్నారని.. ధాన్యం కొనుగోలు చేయకుండా అన్నదాతలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల నుంచి తెలంగాణలో ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తోందన్నారు. రైతాంగం పండించిన ధాన్యం మీద మొత్తం పెట్టుబడి కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. 

‘కేంద్రం రా రైస్ మాత్రమే తీసుకుంటామని తెలిపింది. దంపుడు బియ్యం వద్దని చెబితే.. దీనికి రాష్ట ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనకపోవడతో రైతులు కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. రాజకీయాలు పక్కనపెట్టి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి. ధనిక రాష్ట్రం అని చెప్పే ముఖ్యమంత్రి.. రైతుల ధాన్యం ఎందుకు కొనడంలేదని సూటిగా అడుగుతున్నా. కేంద్రం అవసరానికి మించిన ధాన్యం కొనుగోలు చేయం అని ముందే చెప్పింది. అయినా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి మొద్దు నిద్రలో ఉన్నారు. పోలీసులను వాడుకుని సీఎం దౌర్జన్య రాజకీయాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రాబోతోంది’ అని ఈటల చెప్పారు.