కాళేశ్వరం పేరుతో ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు: వివేక్‌‌ వెంకటస్వామి

కాళేశ్వరం పేరుతో ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు: వివేక్‌‌  వెంకటస్వామి

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెట్టిందని, రైతులను కోటీశ్వరులను చేస్తామని కాంట్రాక్టర్లను ధనవంతులుగా చేసిందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌‌  వెంకటస్వామి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రా కాంట్రాక్టర్లే బాగుపడ్డారన్నారు. ఇరిగేషన్​పై శ్వేతపత్రం సందర్భంగా జరిగిన చర్చలో వివేక్‌‌  మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్సార్​ హయాంలో ప్రాణహిత ప్రాజెక్టును రూ.33 వేల కోట్లతో చేపట్టి అప్పటి ప్రభుత్వం రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. మిగిలిన రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్ట్‌‌ పూర్తయ్యేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును తానే డిజైన్‌‌  చేశానని కేసీఆర్ గొప్పగా చెప్పుకున్నారని, ఐదేళ్లలో 940 టీఎంసీల నీళ్లు  పంపింగ్‌‌ చేయాల్సి ఉండగా 18% మాత్రమే పంపింగ్  చేశారని ఎద్దేవా చేశారు. గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని వదిలి 100 మీటర్లు పైగా లిఫ్టు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీ వల్ల చెన్నూరు, మంథని, మంచిర్యాల నియోజకవర్గాల్లో బ్యాక్‌‌  వాటర్‌‌తో రైతులు దాదాపు లక్ష ఎకరాలు నష్టపోతున్నారు. పరిహారం కోసం ధర్నా చేసినా నాటి బీఆర్ఎస్  ప్రభుత్వంలో కదలిక రాలేదు. బ్యాక్‌‌ వాటర్‌‌ తో రైతులు నష్టపోకుండా చూడాలని మంత్రి ఉత్తమ్‌ను కోరాం.

వచ్చే వానాకాలానికి ముందే సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశాం” అని వివేక్  తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. 40 వేల కోట్ల ప్రజా ధనాన్ని కేసీఆర్  వృథా చేశారని ఆయన ఫైర్  అయ్యారు. దీనిపై ఒక ఎంక్వైరీ పెట్టి  బాధ్యులను శిక్షించాలని డిమాండ్  చేశారు. 17లక్షల  ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పి లక్ష ఎకరాలకే నీళ్లు వచ్చేలా చేశారని మండిపడ్డారు.
జగన్‌‌, కేసీఆర్‌‌ మ్యాచ్‌‌ ఫిక్సింగ్‌‌ కృష్ణా జలాలపై ప్రాజెక్టుల విషయంలో 2018 నుంచి వీ6, వెలుగు అనేక కథనాలు వెలువరించాయని వివేక్  తెలిపారు. ఈ విషయంపై అపెక్స్‌‌ కౌన్సిల్‌‌కు ఎందుకెళ్లలేదని అనేక సార్లు చెప్పిందన్నారు. వెలుగు కథనాలు రాస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌‌, ఏపీ సీఎం జగన్‌‌  మధ్య మ్యాచ్‌‌ ఫిక్సింగ్‌‌ జరిగిందని ఆరోపించారు. హెడ్‌‌ రెగ్యులేటరీ 11 వేల క్యూసెక్‌‌ల నుంచి 80 వేల క్యూసెక్‌‌లకు పెంచారని, అక్రమంగా సంగమేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. ఇంత జరుగుతున్నా నాటి బీఆర్ఎస్  ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, అపెక్స్‌‌  కౌన్సిల్‌‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మేఘాకు కాంట్రాక్ట్‌‌  ఇవ్వడం, ఆ సంస్థ జెట్టి పెట్టి మరీ తెలంగాణ నుంచి ఇసుక, కంకరను ఆంధ్రాకు తరలించుకుపోయిందని ఆరోపించారు.

దీనిపై వీ6, వెలుగు కథనాలు రాస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. పైగా తమ సంస్థలను బ్యాన్‌‌  చేసిందని గుర్తుచేశారు. దాదాపు రూ.150 కోట్ల ప్రకటనలు ఇవ్వలేదని విమర్శించారు. మరోవైపు,  ఎలక్షన్‌‌  టైమ్‌‌లో తన ప్రత్యర్థి రూ.8.50 కోట్లు ట్రాన్స్‌‌ఫర్‌‌  అవుతున్నాయని లెటర్‌‌ రాస్తే తనపై ఈడీ రైడ్‌‌లు జరిగాయని, అలాంటిది కాళేశ్వరం, కృష్ణానది ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తున్నపుడు ఈడీ ఎందుకు సోదాలు చేయలేదని ప్రశ్నించారు. 

చిన్న కాంట్రాక్టర్లను ప్రోత్సహించండి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద వర్గాలకు చెందిన  కాంట్రాక్టర్లకు రూ.5  కోట్లు, రూ.10 కోట్ల చిన్న కాంట్రాక్టులు ఇవ్వాలని, ఆ వర్గం కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలని సీఎం రేవంత్‌కు వివేక్ విజ్ఞప్తి చేశారు.
వెంకటస్వామి వల్లే ప్రాణహిత ప్రాజెక్టు
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టాలని మాజీ సీఎం వైఎస్సార్‌‌తో తన తండ్రి వెంకటస్వామి చాలాసార్లు చర్చించారన వివేక్‌‌  తెలిపారు. ‘‘ప్రాణహితలో నీళ్లు లేవని, అది ఫెయిల్డ్‌‌ ప్రాజెక్ట్‌‌  అన్నారు. కానీ, వైఎస్సార్‌‌ను హెలికాప్టర్​లో తీసుకెళ్లి అక్కడ నీళ్లు ఉన్నాయని వెంకటస్వామి చూపారు. అక్కడ ప్రాజెక్టు కడితే ఆదిలాబాద్‌‌, కరీంనగర్‌‌  జిల్లా ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయననను ఒప్పించి ప్రాజెక్టును సాంక్షన్‌‌  చేయించారు” అని వివేక్ గుర్తుచేశారు.