- దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి
- ఎమ్మెల్యే హామీతో పాదయాత్రను విరమించిన అడ్వకేట్స్
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి హామీ ఇచ్చారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అలంపూర్ కు చెందిన 12 మంది న్యాయవాదులు నిర్వహించిన పాదయాత్రగా శుక్రవారం భూత్పూర్కు చేరుకుంది.
భూత్పూర్ చౌరస్తాలో న్యాయవాదులతో దేవరకద్ర ఎమ్మెల్యేతోపాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలయ్యేలా చూస్తామని, దీక్ష విరమించాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయవాద సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి నేతృత్వంలో వరంగల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల న్యాయవాద సంఘాల అధ్యక్షులతో పాదయాత్రలో పాల్గొన్న 12 మంది సభ్యులు సమావేశమయ్యారు.
ఎమ్మెల్యేల హామీ మేరకు పాదయాత్రను విరమించుకునేందుకు వారు అంగీకరించారు. ఈ సందర్భంగా భూత్పూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. న్యాయవాదుల రక్షణ చట్టం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో 15 మంది న్యాయవాదులతో కూడిన కమిటీని సీఎం రేవంత్రెడ్డి వద్దకు తీసుకెళ్తామని తెలిపారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో న్యాయవాదుల రక్షణ చట్టం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేసేలా బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో న్యాయవాదులు పాదయాత్రను విరమించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల న్యాయవాదుల సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల, మహబూబ్నగర్ న్యాయవాదులు, కార్యవర్గ సభ్యులతోపాటు మీడియా ఇన్చార్జి తగిలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
