ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే కేసులు పెట్టిస్తుండు

ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యే కేసులు పెట్టిస్తుండు
  •   హెచ్​ఆర్​సీ, గవర్నర్​కు ఫిర్యాదు చేసిన బాధితుడు

వికారాబాద్/చేవెళ్ల వెలుగు: తమ సమస్యలపై, ఎమ్మెల్యే హామీలపై సోషల్ ​మీడియాలో ప్రశ్నిస్తే.. కేసులు పెట్టిస్తున్నాడని  నవాబు పేట మండలం పులుమామిడికి చెందిన తెలుగు రాఘవేందర్ నాంపల్లిలోని హెచ్​ఆర్​సీ (మానవ హక్కుల కమిషన్)కు, రాష్ట్ర గవర్నర్​కు ఫిర్యాదు చేశాడు. చేవెళ్ల ఎమ్యెల్యే కాలే యాదయ్యను ఫేస్ బుక్, వాట్సప్ ద్వారా ప్రశ్నించినా, తమ గ్రామాల్లోని సమస్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, సదరు వ్యక్తులను గుర్తించి లాఠీలు విరిగేలా ఎస్ఐ భరత్​రెడ్డి కొడుతూ అక్రమ కేసులు పెడుతున్నాడని బాధితుడు వాపోయాడు. ఎమ్యెల్యే యాదయ్య సొంత గ్రామానికి బ్రిడ్జి నిర్మించలేదని, 2018లో శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు  పనులు మొదలు పెట్టలేదని , ఓ వీడియోను వాట్సాప్ ,ఫేస్ బుక్ గ్రూప్ ల్లో పోస్ట్ చేశానన్నారు. ఆ రోజు నుంచి ఎస్ఐ భరత్ రెడ్డి వేధింపులకు పాల్పడుతున్నాడన్నారు.  గ్రామానికి చెందిన ఎంపీటీసి భర్త రామకృష్ణారెడ్డితో పాటు దాయాదులను ఉసిగొలిపి పొలానికి వేసిన విద్యుత్ స్తంభాలు విరగొట్టించాడని, జడ్పీ జనరల్ ఫండ్​తో వేసిన ఫార్మసీ రోడ్డును తవ్వేశాడని ఆందోళన వ్యక్తం చేశాడు. తన పొలానికి వేసిన విద్యుత్ స్తంభాలు విరగొట్టారని ఈ నెల 4న పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఇచ్చిన 
ఫిర్యాదును బుట్టలో పడేసి ఎస్ఐ తన పైనే బెదిరింపులకు పాల్పడ్డాడన్నాడు.  ఫిర్యాదు చేసిన వారం తర్వాత నా పొలం వద్దకు వచ్చిన ఎస్ఐ భరత్ రెడ్డి దాయాదులను టీఆర్ఎస్ ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పిలిపించి పంచాయతీ పెట్టించి తనపై దగ్గరుండి దాడి చేయించాడని ఆరోపించాడు.  తనకు ఎస్ఐ భరత్ రెడ్డి, ఎంపీటీసీ భర్త రామకృష్ణారెడ్డి నుండి ప్రాణహాని ఉందని బాధితుడు తెలిపాడు. ఎస్ఐ భరత్ రెడ్డి వచ్చిన రెండు నెలల్లోనే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడని చెప్పాడు.  మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామానికి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో ప్రశ్నించిన కారణంగా ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి రెండు రోజుల పాటు చితక బాదాడన్నాడు. పోలీసు ఉన్నతాధికారులు ఎమ్మెల్యేల ఒత్తిడితో పట్టించుకోవడం లేదని బాధితుడు రాఘవేందర్ వాపోతున్నాడు.