బీసీలకు లక్ష సాయంలో కమీషన్లు తీసుకుంటున్నరు

బీసీలకు లక్ష సాయంలో కమీషన్లు తీసుకుంటున్నరు
  • ప్రజాప్రతినిధులు 20 వేల దాకా వసూలు చేస్తున్నరు: ఎమ్మెల్యే జోగు రామన్న 
  • ఆదిలాబాద్​లో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ 
  • ఫస్ట్ లిస్టులో అనర్హులు ఉన్నారని రెండు చెక్కులు నిలిపివేత 

ఆదిలాబాద్, వెలుగు: బీసీలకు అందిస్తున్న రూ.లక్ష సాయంలో స్థానిక ప్రజాప్రతినిధులు కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆదిలాబాద్ జెడ్పీ ఆఫీసులో బీసీలకు రూ.లక్ష సాయం పథకం కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు రూ.10 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేల నుంచి రూ.20 వేల కమీషన్లు తీసుకుంటున్నారని కొందరు లబ్ధిదారులు నాకు ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో విచారిస్తే లంచాలు తీసుకుంటున్నది నిజమేనని తెలిసింది. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో సర్వే చేసి లిస్టులు తయారు చేస్తుండడంతో అక్రమాలు జరుగుతున్నాయి. ఎంపీడీవోలు సర్వే చేస్తే అనర్హులకు అవకాశం ఉండేది కాదు” అని అన్నారు. ఫస్ట్ లిస్టులో ఓ ప్రభుత్వ ఉద్యోగి, మరో వ్యాపారి పేరు ఉందని చెప్పారు. అధికారుల నిర్లక్ష్యం,  ప్రజాప్రతినిధుల చేతివాటం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఫైర్ అయ్యారు. 

విచారణకు ఆదేశం.. 

ఈ స్కీమ్​కింద ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో11,720 దరఖాస్తులు వచ్చాయి. సర్వే తర్వాత 6,300 మందిని అర్హులుగా గుర్తించారు. మొదటి విడత కింద నియోజకవర్గానికి రూ.3 కోట్ల చొప్పున రూ.6 కోట్లు మంజూరయ్యాయి. ఆదిలాబాద్ లో ఫస్ట్ లిస్టు కింద 10 మందిని ఎంపిక చేశారు. వారికి గురువారం చెక్కులు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే జోగు రామన్న వచ్చారు. అయితే ఆ లిస్టులో ఇద్దరు అనర్హులు ఉన్నారని చెప్పిన ఎమ్మెల్యే.. ఆ రెండు చెక్కులను నిలిపివేశారు. దీనిపై విచారణ జరిపించాలని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లను ఆదేశించారు. కాగా, ఫస్ట్ లిస్టులోనే అనర్హులు బయటపడడం, స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే ప్రజాప్రతినిధులు కమీషన్లు తీసుకుంటున్నారని చెప్పడంతో పథకం అమలు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

విచారణ జరిపిస్తున్నం..  

ఫస్ట్ లిస్టులో ఇద్దరు అనర్హుల పేర్లు వచ్చినట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు  రెండు చెక్కులను నిలిపివేసి విచారణ జరిపిస్తున్నాం. ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి చర్యలు తీసుకుంటాం. 
- రాజలింగు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్