సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నరు: కడియం శ్రీహరి

సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నరు: కడియం శ్రీహరి
  • ఆయనకు ఎవరూ సరిగా బ్రీఫింగ్​ ఇవ్వడం లేదు :  కడియం

హైదరాబాద్, వెలుగు : ‘‘సీఎం రేవంత్ ​రెడ్డికి అవగాహన లేదా? ఆయనకు ఎవరూ సరైన బ్రీఫింగ్​ఇవ్వడం లేదా?’’ అనే సందేహం కలుగుతోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఫార్మా సిటీ రద్దు, మెట్రో రైలు అలైన్​మెంట్​ మార్పు లాంటి విషయాల్లో మూడు నాలుగు రోజుల్లోనే మాట మార్చడం చూస్తుంటే అదే అనుమానం కలుగుతోందన్నారు. సీఎం కనీసం హోం వర్క్​ చేయకుండా మాట్లాడుతున్నారని అనిపిస్తోందన్నారు. సీఎం నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే.. అది జీవోతో సమానమని ఆయన అన్నారు. శనివారం తెలంగాణ  భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాగ్​పూర్​లో నిర్వహించిన కాంగ్రెస్​ అవిర్భావ సభలో దేశానికి అదానీ, ప్రధాని పీడ పట్టిందన్న రేవంత్..​ కొన్ని రోజుల్లోనే అదే అదానీకి రెడ్​ కార్పెట్​తో స్వాగతం పలికారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రారంభించకపోగా.. గత ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తోందన్నారు. 

ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, గృహలక్ష్మిలో ఇంటి నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 6 గ్యారంటీల్లో రెండు గ్యారంటీలు అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారని.. ఏ గ్యారంటీలు అమలు చేశారో స్పష్టత ఇవ్వాలన్నారు. తాము తొందరపడి విమర్శలు చేయడం లేదని.. కాంగ్రెస్​హామీలు డిసెంబర్​9న అమలు చేస్తామన్న విషయాన్ని గుర్తు చేస్తున్నామని తెలిపారు. తాము కాంగ్రెస్​ పార్టీని చార్​సౌ బీస్​అని అనడం లేదని.. కాంగ్రెస్​ హామీల సంఖ్య 420 అని వాళ్ల హామీల సంఖ్య మాత్రమే గుర్తు చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ప్రజా దర్బార్​లో ప్రజలను కలుస్తానని చెప్పుకున్నారని, ఇప్పుడు మంత్రులు కూడా ఆ కార్యక్రమానికి రావడం లేదన్నారు. పెద్దపల్లి ఎంపీ సీటును గెలవడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని ఎమ్మెల్సీ భానుప్రసాద్​రావు అన్నారు.