రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆపోహలు సృష్టిస్తున్నరు

రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆపోహలు సృష్టిస్తున్నరు

తాను పార్టీ మారతానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారతారంటూ అనేక వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై ఆయన స్పందించారు. అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేశారు. అమిత్ షాని ఇంతకు ముందు కూడా చాలా సార్లు కలిశానని.. ఇప్పుడదేం కొత్త కాదని చెప్పారు. అందరి సమక్షంలోనే తాను అమిత్ షాతో భేటీ అయ్యానన్నారు. తాను కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ఓ దినపత్రికతో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. తమ కార్యకర్తలు, అభిమానులను గందరగోళానికి గురిచేసే కుట్రలకు తెరలేపారన్నారు. ఈ ప్రచారంపై కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి గందరగోళానికి గురికావద్దని చెప్పారు.

మునుగోడు నియోజకవర్గానికి ఒక్క పైసా కూడా కేటాయించని సీఎం కేసీఆర్..చాలా ఏండ్లుగా అడుగుతున్న గట్టుప్పల్ మండలాన్ని వెంటనే ప్రకటించారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. నాయకులను కొనేందుకు రాత్రికి రాత్రే డబ్బు సంచులు రెడీ చేసుకున్నారని ఆరోపించారు. భువనగిరి లోక్ సభతో పాటు మునుగోడు శాసనసభ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో చర్చించకుండా నేను ఏ నిర్ణయం తీసుకునేది లేదని స్పష్టం చేశారు. అందరితో కలిసి చర్చించిన తర్వాతే కేసీఆర్ కుటుంబం అవినీతి, కుటుంబ పాలనపై బహిరంగ యుద్ధ ప్రకటన చేద్దామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో ప్రతిపాదించిన కిష్టరాయినిపల్లి భూ నిర్వాసితులకు మల్లన్నసాగర్ తరహాలో నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటతో సమానంగా అన్ని విధాలుగా వెనకబడిపోయిన మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తే.. తాను ఏ త్యాగానికైనా సిద్ధమని సవాలు విసిరారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, కేసీఆర్ అండ్ టీం చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని తన నియోజకవర్గం కార్యకర్తలకు రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.