దారుణం.. మహిళా అధికారిపై ఎమ్మెల్యే సోదరుడి దాడి

దారుణం.. మహిళా అధికారిపై ఎమ్మెల్యే సోదరుడి దాడి

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనెరు కృష్ణ రెచ్చిపోయారు. ఆయన అనుచరులతో కలిసి అటవీ శాఖ రేంజ్ లేడీ ఆఫీసర్, సిబ్బందిపై దాడికి దిగారు. ఈ దాడిలో FRO అనితకు తీవ్ర గాయాలయ్యాయి.

హరితహారంలో భాగంగా సార్సాలా గ్రామ సమీపంలో ఉన్న అటవీ భూమిని చదును చేసేందుకు FRO అనిత ఆధ్వర్యంలోని  అటవీ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ట్రాక్టర్లతో సహా గ్రామానికి వచ్చిన అటవీ సిబ్బందిని… ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జడ్పీ వైస్ ఛైర్మన్ కోనేరు కృష్ణారావు, అతడి అనుచరులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అటవీభూములను స్వాధీనం చేసుకుంటామని FRO అనిత చెప్పడంతో.. ఆగ్రహించిన వారు ఒక్కసారిగా ఆమెపై కర్రలతో దాడి చేశారు. ఈఘటనలో అనితతో పాటు పలువురు అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన FRO అనితను కాగజ్ నగర్  ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అటవీ అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.