ఆసిఫాబాద్, బెల్లంపల్లి రూరల్, పెంబి వెలుగు : రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసాపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఏసీఎస్ చైర్మన్ అలీబిన్ అహ్మద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్, జిల్లా నాయకురాలు సరస్వతి, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.
రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలి
రైతు భరోసా డబ్బులను ప్రభుత్వం విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పెంబి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్ల నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. యాసంగి వస్తున్నా ఖరీఫ్‌కు సంబంధించిన డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వంఇంకా విడుదల చేయలేదన్నారు. కమిటీల పేరిట కాలయాపన
చేస్తోందని, రైతు భరోసా డబ్బులు వెంటనే విడుదల చేయాలన్నారు. మాజీ వైస్ ఎంపీపీ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్, నాయకులు మహేందర్, శంకర్, రమేశ్, షారుఖ్, సూర్య, రాజేందర్ తదిత రులు పాల్గొన్నారు.
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, వెంటనే రైతులకు రైతు భరోసా అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాసిపేట, నెన్నెల మండలాల్లో ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలం రైతు భరోసా ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని రైతు భరోసాతో పాటు రైతు బీమా, రూ.4 వేల పెన్షన్, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు రమణరెడ్డి, మంజులరెడ్డి, చంద్రయ్య, రాంచందర్, బాదు, రాజు పాల్గొన్నారు.