రూప్ వైరు తెగిపోవడం వల్ల  సమస్య లేదు

రూప్ వైరు తెగిపోవడం వల్ల  సమస్య లేదు

గద్వాల, వెలుగు: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సాక్షిగా గద్వాల జిల్లా ధరూర్ మండలం ర్యాలంపాడ్ రిజర్వాయర్ గేటు ఎత్తి కాల్వలకు నీళ్లు విడుదల చేస్తుండగా గేట్ రూప్ వైరు తెగి పడిపోయింది. బుధవారం రిజర్వాయర్ వెంట్ లోని గేటును ఓపెన్ చేసేందుకు హ్యాండిల్ పట్టుకొని తిప్పుతుండగా ఒక్కసారిగా రూప్ వైరు తెగిపోయింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే పట్టు తప్పిపోగా, పక్కనే ఉన్నవారు పట్టుకున్నారు. పక్కనే ఉన్న డీసీసీ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప పాయింటుకు గ్రీస్, కందెన అంటింది. వెంటనే మరో వెంట్ నుంచి గేటును ఓపెన్ చేసి నీటిని విడుదల చేశారు. 

వచ్చే ఏడాది పూర్తిస్థాయి నీటిమట్టం

ర్యాలంపాడు రిజర్వాయర్ కు గత ఏడాది బుంగలు పడి ఆనకట్ట దెబ్బతిన్నదని, అప్పటినుంచి రెండు టీఎంసీలను మాత్రమే నిలుపుదల చేస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు. వచ్చే ఏడాది పూర్తిస్థాయిలో నాలుగు టీఎంసీల నీటిమట్టం స్టోరేజీ చేస్తామన్నారు. ఆయకట్టుకు ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ సరోజ, ఎంపీపీ నజీమా ఉన్నిసా బేగం, జడ్పీటీసీ పద్మ పాల్గొన్నారు.

సమస్య లేదు

రూప్ వైరు తెగిపోవడం వల్ల  సమస్య లేదు. రిజర్వాయర్ కి నాలుగు వెంట్లు ఉన్నాయి. ప్రతి వెంట్ కు రెండు గేట్లు ఉంటాయి. ఒక గేటు ద్వారా కాలువలకు నీటిని విడుదల చేశాం. తెగిపోయిన రూప్​వైరు స్థానంలో మూడు నాలుగు రోజుల్లో కొత్తవి బిగిస్తాం. టెక్నికల్ ఇష్యూతో ఇలాంటి ఘటనలు జరగడం కామనే.
- ఏఈ వెంకట్ రెడ్డి