
హనుమకొండ, వెలుగు : రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే బీఆర్ఎస్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఎవరు పార్టీ మారినా వెంటనే సభ్యత్వం రద్దు చేయాలని, ఇందుకు పార్టీ ఫిరాయింపుల చట్టంలోనే మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. హనుమకొండ హరిత కాకతీయలో సోమవారం నిర్వహించిన మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడేందుకే ప్రాజెక్టుల డిజైన్లలో మార్పులు చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం ఇంజినీర్ల వద్దే రూ. వెయ్యి కోట్లు బయటపడితే.. అసలు ప్రాజెక్ట్‌లో ఎంత అవినీతి జరిగిందో తేల్చాలన్నారు. కాళేశ్వరంలో అవినీతే జరగలేదని బీఆర్‌ఎస్ లీడర్లు చెప్పగలరా..? అని సవాల్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను బీఆర్‌ఎస్ ఏటీఎంలా మార్చుకుందని, కాళేశ్వరం, జూరాల, సీతారామ ప్రాజెక్ట్‌లను ఎందుకు రీ డిజైన్ చేశారో చెప్పాలన్నారు.
సీబీఐ కేంద్రం కనుసన్నల్లో కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసేది కమ్యూనిస్టులేనని.. సురవరం, సీతారాం ఏచూరి, గద్దర్ లాంటివాళ్లు చనిపోయినప్పుడు ప్రజలు నీరాజనాలు పలికారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం నుంచి సెక్యులర్, సోషలిజం పదాలను తొలగిస్తూ.. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని ప్రశ్నించే వారిని అణిచివేస్తోందని ఆరోపించారు.
కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, సీపీఐ హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు కర్రె భిక్షపతి, షేక్ భాషామియా, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి గాదె ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి పాల్గొన్నారు.