ప్రొఫెసర్ నాగేశ్వర్ ను మానసికంగా వేధించాలని కుట్ర చేస్తున్నారని అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. 2026 మే 27న మీడియా సమావేశం నిర్వహించిన కూనంనేని.. ప్రొఫెసర్ నాగేశ్వర్ విలువలకు కట్టుబడిన వ్యక్తి అని.. ఆయను వేధించాలని కుట్ర చేయడం తగదన్నారు. పవన్ కళ్యాణ్ విమర్శించొచ్చు కానీ.. నాగేశ్వర్ విమర్శించొద్దా..? అంటూ ప్రశ్నించారు.
నన్ను అన్నా పర్వాలేదు అమిత్ షాను ఎట్లా అంటారని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు.. అమిత్ షా చేసే తప్పులను పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను ఇబ్బంది పెడితే వాళ్ళకే నష్టమని ఈ సందర్భంగా సూచించారు కూనంనేని.
కేంద్రం నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని.. ధరల పెంపుపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద వేయకుండా.. కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. సింగరేణి పరిస్థితి రోజు రోజుకు అధ్వాన్నంగా తయారవుతోందన్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిలో కార్మికులను తగ్గించి.. లాభాలు తీసుకోవాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని ఆరోపించారు. సింగరేణిని బతికించాల్సిన అవసరం ఉందన్నారు.
