కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి మోదీ వ్యాఖ్యలే నిదర్శనం : ఎమ్మెల్యే  కూనంనేని

కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి మోదీ వ్యాఖ్యలే నిదర్శనం : ఎమ్మెల్యే  కూనంనేని
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే  కూనంనేని వెల్లడి
  • ప్రజల దృష్టి మళ్లించేందుకే మత రాజకీయాలని విమర్శ 

హైదరాబాద్, వెలుగు: ‘వంట నూనె, పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించాలి, బంగారం కొనొద్దు’ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకే మతం పేరుతో రెచ్చగొట్టేలా హైదరాబాద్ సభలో ఒక ప్రధానిగా ప్రసంగించడం విచారకరమని తెలిపారు. త్వరలో ధరల పెంపునకు ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారని వెల్లడించారు.

ప్రధానికి చిత్తశుద్ధే ఉంటే దేశ ప్రజలకు పొదుపు చర్యలను సూచించే ముందు, దేశంలో శతకోటీశ్వరులపై 2 నుంచి 6 శాతం సంపద పన్ను విధిస్తే లక్షల కోట్ల నిధులు సమకూరుతాయని తెలిపారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చేసిన ప్రకటన కలగానే మిగిలపోవడం ఖాయమని, మత రాజకీయాలను ప్రగతిశీల తెలంగాణ నేల ఎన్నటికీ అనుమతించదని స్పష్టం చేశారు.