
హైదరాబాద్, వెలుగు : " నా ఒరిజినాలిటీ మీకు తెలియదు. నేనింకా నా నోరు విప్పలేదు. నా జోలికి రావొద్దు " అంటూ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ తరఫున సభలో ఉన్నది తానొక్కడినే అయినా.. తన నియోజకవర్గ ప్రజలతోపాటుగా లక్షల మందికి ప్రతినిధినేనని తెలిపారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా.. సీపీఐకి ఉన్న ఒక్క సభ్యుడికి ఎంత సమయం ఇస్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పీకర్ ను అడిగారు. దానికి కూనంనేని స్పందిస్తూ.." నా నియోజకవర్గంలోని లక్షల మందికి నేనొక్కడినే ప్రతినిధిని. నా ఒరిజినాలిటీ మీకు తెలియదు. నా జోలికి రావొద్దు" అని కౌంటర్ ఇచ్చారు.
తాము అధికార పార్టీకి మిత్రపక్షం అయినప్పటికీ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. " బడ్జెట్ పైసభ్యులు మాట్లాడిన వ్యవహారం చూస్తుంటే అన్నప్రాసన రోజే ఆవకాయ తినాలన్నట్లు ఉంది. ఆరు నెలలు కూడా కాకముందే ప్రభుత్వం పని అయిపోయిందని మాట్లాడడం సమంజసం కాదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రస్తుత ప్రభుత్వం సమీక్ష జరపాలి. లక్షల కోట్ల అప్పులతో సృష్టించిన ఆస్తులేమయ్యాయో తేల్చాలి. కాళేశ్వరం కుంభకోణంపై లోతైన విచారణ జరపాలి. ధరణి పోర్టల్ సమస్యలను పరిష్కరించాలి. జర్నలిస్టులకు సరైన వేతనాలు అందేలా చూడటంతోపాటు వారికి వైద్య బీమా కల్పించాలి. వారి సంక్షేమానికి ప్రత్యేక పాలసీని తీసుకురావాలి. రుణమాఫీ అవ్వని రైతుల వివరాలను మరోసారి పరిశీలించాలి. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాల్సిందే" అని కూనంనేని స్పష్టం చేశారు.