
హైదరాబాద్, వెలుగు : ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్‌కు కనీసం సభా మర్యాద తెలియడం లేదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతుండగా.. హరీశ్ రావు పదే పదే డిస్టర్బ్ చేస్తుండడంతో మదన్ మోహన్ రావు గట్టిగానే స్పందించారు. తనను పది నిమిషాలు కూడా మాట్లాడనివ్వడం లేదని, కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? అంటూ నిలదీశారు. బీఆర్ఎస్ వాళ్లు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని, ఓడిపోయామన్న బాధ ఇంకా వారిని వెంటాడుతూనే ఉందన్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు మళ్లీ మొత్తుకోవడంతో.. పదేండ్లు వీళ్లెట్లా రాష్ట్రాన్ని పాలించారో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూర్చోవాలంటూ స్ట్రాంగ్‌గా చెప్పారు. ‘‘మీ లీడర్ (కేసీఆర్) 3 నెలలు చూద్దామని చెప్పారు. కానీ, మీరు కనీసం మూడ్రోజులు కూడా ఓపిక పట్టలేకపోతున్నారు. ధనిక రాష్ట్రమంటూ కేసీఆర్ ఇదే సభలో చెప్పారు. కానీ, వారి కుటుంబమే బంగారు కుటుంబమైంది. వజ్రాల కుప్పలు వారి ఇండ్లకే నడిచి వచ్చినయ్’’ అని ఆయన అన్నారు.
సబ్జెక్ట్‌పై మాట్లాడకుండా తప్పుడు వ్యాఖ్యలు
బీఆర్ఎస్ సభ్యులు సబ్జెక్ట్‌పై మాట్లాడకుండా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది దురదృష్టకరమని మదన్ మోహన్ రావు అన్నారు. దయనీయ పరిస్థితుల్లో రాష్ట్రం ఇచ్చారంటున్నారని.. కానీ, 2014లో నాటి యూపీఏ ప్రభుత్వం మిగులు రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ప్రజలకు రాష్ట్ర బ్యాలెన్స్ షీట్‌పై నిజాలు చెప్పాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు నెల జీతాలు టైంకు వేయలేదని, ఫలితంగా ఈఎంఐలను టైంకు కట్టలేకపోయారని అన్నారు. దీంతో ఉద్యోగుల సిబిల్ స్కోర్పడిపోయిందని చెప్పారు. ఐటీ ఎక్స్‌పోర్ట్స్ 2.5 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పుకోవడం కాదని, దాని వల్ల ఎంత మంది పేదలకు మేలు జరిగిందని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు.