హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడుతున్న తీరు చూస్తే స్పైడర్ సినిమాలో విలన్‌లా అనిపిస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోబియో వీరికి పట్టుకుందని, బీఆర్ఎస్ నేతల మాటలు చూస్తుంటే హంతకులే సంతాప సభలు పెట్టినట్టుగా ఉన్నాయని విమర్శించారు.
గతంలో ఆంధ్ర సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు కూడా అదే విధంగా రాజకీయాలు చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. బీఆర్ఎస్ వద్ద ఉన్న రూ.1,400 కోట్ల నిధులను తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు.
