
- అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు : ఎమ్మెల్యే మేఘారెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్నేతలు కేటీఆర్, హరీశ్ రావుకు మైండ్ దొబ్బిందని, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మేఘారెడ్డి విమర్శించారు. బుధవారం గాంధీ భవన్లో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా సంక్షేమ పథకాలు ఇస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు. ‘‘రూ.27,400 కోట్లు బీఆర్ఎస్ హయాంలో పాలమూరు -రంగారెడ్డికి ఖర్చు పెట్టామని.. 90 శాతం పూర్తయ్యిందని అంటున్నారు.
మిగిలిన పది శాతం నిధులు ఇప్పిస్తాం పూర్తి చేస్తారా?’’ అని ప్రశ్నించారు. ఇటీవల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఊరూరుకెళ్లి దండాలు పెట్టి రైతులను సమావేశానికి తరలించారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ కానీ రైతులను వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కి తీసుకురావాలని సూచించారు. టీడీపీ, కాంగ్రెస్ వనపర్తి కి ఏం చేయలేదని అంటున్నారని, చంద్రశేఖర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఏం చేశారో చెప్పాలన్నారు.