పల్లా బహిరంగ క్షమాపణలు చెప్పాలి: ముత్తిరెడ్డి

పల్లా బహిరంగ  క్షమాపణలు చెప్పాలి: ముత్తిరెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు కుక్కలని  పల్లా చేసిన  వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని  డిమాండ్ చేశారు. పల్లా బహిరంగంగా క్షమాణాలు చెప్పాలన్నారు.   సీఎం ,బీఆర్ఎస్ కు నష్టం జరిగిలా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర స్థిరత్వం కోసం సీఎం తీసుకున్న నిర్ణయాన్ని వక్రీకరించారని చెప్పారు. కేసీఆర్ నిర్ణయం తనకు శిరోధార్యమని  గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధిస్తామన్నారు.

జనగామకు చాలా చరిత్ర ఉందని.. పౌరుషాలకు నిలయమైన గడ్డ అని ముత్తిరెడ్డి అన్నారు. నాడు సీఎం అభ్యర్థి, బలమైన నాయకుడిని ఓడగొట్టిన చరిత్ర తనదన్నారు. తనకు  కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం  అన్నారు. తెలంగాణలో ఏ గడ్డ ఎలాంటిందో..ఏ మనిషి ఎలాంటి వాడో కేసీఆర్ కు బాగా తెలుసన్నారు. కేసీఆర్ పై పూర్తి నమ్మకం ఉందని.. తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశించారు. ప్రజాప్రతినిధులను డబ్బులతో కొనుగోలు చేసి రాజకీయాలను మలినం చేయొద్దని సూచించారు.

గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య జనగామ టికెట్ వార్ కొనసాగుతోంది. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ముత్తిరెడ్డి తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. జనగామ టికెట్ ను కేసీఆర్ పెండింగ్ లో ఉంచారు.