- అసెంబ్లీని కౌరవ సభ, బూతుల సభ అనడంపై సీరియస్
వరంగల్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీని కౌరవ సభ, బూతుల సభ అంటూ మాట్లాడిన బీఆర్‍ఎస్ నేత కేటీఆర్ మళ్లీ వరంగల్ వస్తే చెప్పులతో కొట్టిస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి సీరియస్‍గా స్పందించారు. కేటీఆర్ మంగళవారం జనగామ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‍రెడ్డిని పరుష పదజాలంతో దూషించడంపై బుధవారం హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు.
బీఆర్‍ఎస్ నేత కేటీఆర్ మాటతీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు చిల్లరగా తయారయ్యారన్నారు. రానున్న రోజుల్లో వారి ఫ్యామిలీని జనాలు బహిష్కరించే పరిస్థితి వస్తుందన్నారు. తిట్లు తిట్టడంలో తాము పీహెచ్‍డీలు చేశామని.. ఆ పని మొదలుపెడితే కల్వకుంట్ల కుటుంబానికి ఆత్మహత్యలు తప్పవన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కాళ్లు మొక్కినవారే నేడు తిట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేటీఆర్ తన భాష మార్చకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
