
అసంతృప్త లీడర్లకు దసరా శుభాకాంక్షలు
మెదక్, కౌడిపల్లి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం మెదక్ జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. దసరా పండగ నేపథ్యంలో బీఆర్ఎస్టికెట్ ఆశించి భంగపడి అసంతృప్తితో ఉన్న ముఖ్య లీడర్ల ఇళ్లకు బీఆర్ఎస్బీఫాం అందుకున్న, నేతలు వెళ్లి పండగ శుభాకాంక్షలు తెలిపారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మధ్య రాజకీయ విబేదాలు ఉన్నాయి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కొన్నేళ్లుగా ఎడమెహం, పెడమోహంగానే ఉంటున్నారు.
ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితోపాటు, సుభాష్ రెడ్డి సైతం బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. అయితే పార్టీ అధిష్టానం మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే టికెట్ కేటాయించింది. దీంతో సుభాష్ రెడ్డి నారాజ్ అయ్యారు. టికెట్ ఆశించి భంగపడి అసంతృప్తితో ఉన్నలీడర్లను కలుపుకుని పోవాలని పార్టీ అధిష్టానం సూచించడంతో పద్మాదేవేందర్ రెడ్డి దసరా పండగ సందర్భంగా సుభాష్ రెడ్డి స్వగ్రామమైన హవేలి ఘనపూర్ మండలం కూచన్ పల్లిలోని తన ఫాం హౌజ్‌లో ఉన్న విషయం తెలిసి మంగళవారం అక్కడికి వెళ్లి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట హవేలీ ఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి తదితరులు ఉన్నారు.
మదన్‌రెడ్డితో సునీత భేటీ
నర్సాపూర్ అసెంబ్లీ స్థానంలో బీఆర్ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితోపాటు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆశిస్తున్నారు. అయితే రాష్ట్రంలో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధిష్టానం నర్సాపూర్ టికెట్ ను పెండింగ్‌లో పెట్టింది. నర్సాపూర్ టికెట్ సునీతా లక్ష్మారెడ్డికి ఇచ్చేందుకే హైకమాండ్ మొగ్గు చూపుతుండడంతో మదన్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టికెట్ వదులుకునే ప్రసక్తి లేదని పలుమార్లు తేల్చి చెప్పారు.
మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలిపించి మాట్లాడినా ఆయన వినడం లేదు. ఈ క్రమంలో మంగళవారం సునీతా లక్ష్మారెడ్డి కౌడిపల్లిలోని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇంటికి వెళ్లి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 20 నిమిషాల భేటి అయిన వీళ్లు నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. వీరితో పాటు నర్సాపూర్ మాజీ ఎంపీపీ లలిత, సీడీసీ మాజీ దుర్గారెడ్డి ఉన్నారు.