
మణుగూరు, వెలుగు : అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చెప్పారు. శనివారం మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో లబ్ధిదారులకు మంజూరైన 80 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం మండలంలో పలుచోట్ల సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేశ్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీఓ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
సన్నబియ్యం పేదలకు వరం
పినపాక : సన్నబియ్యం పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే పాయం అన్నారు. మండలంలోని బయ్యారం క్రాస్‌రోడ్ లోని ఓ ప్రవేటు పంక్షన్ హాలులో శనివారం నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందజేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా పేదలను ఇబ్బందిపెట్టిందని విమర్శించారు.
భూ భారతి చట్టంతో పెండింగ్‌లో ఉన్న భూసమస్యలన్నీ పరిష్కారం కానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపీడీవో సునీల్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు, సివిల్ సప్లై డీటీ శివకుమార్, ఎంఈఓ కొమరం నాగయ్య, మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామనాథం, కాంగ్రెస్ నాయకులు కోర్స ఆనంద్ పాల్గొన్నారు.