పోలీసుల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఫైర్

పోలీసుల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఫైర్
  • కేసులు నాకు కొత్త కాదు.. 
  • మీ ఉడత ఊపులకు భయపడను

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌లో బాలిక ఘటనలో అసలు దోషులను తప్పించి, తనపైనే కేసు పెట్టాలని పోలీసులు దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ‘‘కేసులు ఎదుర్కోవడం నాకు కొత్తేమీ కాదు. నా తప్పుంటే కేసులు పెట్టండి. మీ ఉడత ఊపులకు భయపడేది లేదు” అని స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఆఫీసర్ జోయల్ డేవిస్‌‌కు తానేంటో తెలుసుని చెప్పారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. అమ్మాయి ఫొటోలను తాను విడుదల చేయకముందే అవి అన్ని చానల్స్‌‌లో టెలికాస్ట్ అయ్యాయని తెలిపారు. అయినా తాను బాలిక పేరు చెప్పలేదని, ఆమె ముఖం చూపించలేదని అన్నారు. మజ్లిస్ పార్టీ నాయకులను ఈ కేసు నుంచి కాపాడేందుకే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ నాయకులు తనపైనే ఎదురుదాడి చేయడమేంటని ప్రశ్నించారు. ముందు బాధితురాలికి న్యాయం కోసం పోరాడుదామని, తర్వాత మనం కొట్లాడుకుందామని చెప్పారు. ‘‘నేను బీజేపీలో జాయిన్ కాకముందు అడ్వకేట్‌‌గా నాకు టీఆర్ఎస్, కాంగ్రెస్‌‌లో క్లయింట్స్ ఉన్నారు. ఆ సందర్భంలో వారితో ఉన్న నా పాత ఫొటోలను సర్క్యులేట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఇతర పార్టీలకు ఉంటే మజ్లిస్ ఎమ్మెల్యే కొడుకును అరెస్టు చేయాలని ఎందుకు అడగడం లేదు” అని టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.