హబ్షీపూర్​ స్కూల్​లో ఎమ్మెల్యే తనిఖీ

హబ్షీపూర్​ స్కూల్​లో ఎమ్మెల్యే తనిఖీ

దుబ్బాక, వెలుగు : దుబ్బాక మండలం హబ్షీపూర్​ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే రఘునందన్​రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, సౌకర్యాలపై ఆరా తీశారు. ఆవరణలో ఉన్న సంపు​ పై కప్పు లేకపోవడంతో పిల్లలు అందులో పడితే ఎవరు బాధ్యులని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులతో కలిసి  సంప్​ పై కప్పును సరి చేశారు. స్టూడెంట్స్​ పట్ల టీచర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అనంతరం గ్రామంలోని అంగన్​వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులకు సాయంత్రం ఇచ్చే స్నాక్స్​ ఎందుకు రావడంలేదని సీడీపీవో చంద్రకళను ఫోన్​లో అడిగారు. దుబ్బాక ప్రాజెక్ట్​ పరిధిలోని అంగన్​వాడీ కేంద్రాలకు స్నాక్స్​ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ట్రై సైకిళ్ల పంపిణీ 

అక్బర్​పేట–భూంపల్లి మండలం బొప్పాపూర్​ గ్రామానికి చెందిన వికలాంగులకు ట్రై సైకిళ్లను అందజేశారు. గ్రామస్తుల కోరిక మేరకు బొప్పాపూర్​నుంచి దుబ్బాకకు వెళ్లే మూడు కిలో మీటర్ల రహదారికి సొంత నిధులు కేటాయించి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి తానే ఫీజు భరించి డ్రైవింగ్​ లైసెన్స్​ ఇప్పిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈనెల 29 నుంచి జూలై 5లోగా ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో లైసెన్స్​ లేని వ్యక్తులు ఆధార్​ కార్డ్, బర్త్​ సర్టిఫికెట్, రెండు ఫొటోలను అందజేయాలని సూచించారు. 

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

 తొగుట, వెలుగు:  సిద్దిపేట జిల్లా తొగుట మండల పరిషత్ కార్యాలయంలో 15 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే రఘునందన్ రావు జడ్పీ చైర్​పర్సన్ రోజాశర్మ తో కలిసి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొగుట మండలంలోని అన్ని గ్రామాల రోడ్డులను పూర్తి చేశామన్నారు. కన్గల్ గ్రామ రోడ్డుకు రూ.80 లక్షలు మంజూరయ్యాని చెప్పారు