దుబ్బాకలో హరీశ్ పెత్తనమేంది..?: రఘునందన్ రావు

దుబ్బాకలో హరీశ్ పెత్తనమేంది..?:  రఘునందన్ రావు

దుబ్బాక, వెలుగు : ఉప ఎన్నికల్లో హరీశ్​రావుకు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధిరావడం లేదని..  దుబ్బాక పై పెత్తనం చేయడం ఇకనైనా మానుకోవాలని  ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు.  గురువారం అక్బర్ పేట  భూంపల్లి మండలం  చిట్టాపూర్, దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014  నుంచి మంత్రి పదవిలో ఉన్న హరీశ్​రావు  దుబ్బాకను  ఎందుకు డెవలప్​ చేయలేదని ప్రశ్నించారు. రాష్టంలో బీజేపీ అధికారంలోకి రాదన్న మంత్రి 2014లో బీఆర్ఎస్ లో ఇద్దరే ఎంపీలున్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో  కారుని పంచర్ చేసి  మామ అల్లుడిని ఇంట్లో కూర్చోబెట్టేది బీజేపీ ఎమ్మెల్యేలే అని  హెచ్చరించారు. దుబ్బాకలో విమర్శలకు దిగేతే సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో తానే స్వయంగా చర్చకు వస్తానని సవాల్ విసిరారు. 

మెదక్ (చేగుంట) :  మంత్రి హరీశ్ రావు దిగజారుడు మాటలు మానుకోవాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. చేగుంటలో మీడియాతో మాట్లాడుతూ.. ఆడ లేక మద్దెల ఓడు అన్నట్టు దుబ్బాకలో మంత్రి హరీశ్​రావు తన స్థాయి దిగజారి మాట్లాడారని విమర్శించారు.  తాను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి గరీబోల్లు పెళ్లి పత్రిక పట్టుకుని ఇంటికి వస్తే సుమారు 100 మందికి పుస్తె మట్టెలు పంపిణీ చేశానని, హరీశ్ రావు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎవరికైనా ఒక్క తాళిబొట్టు ఇచ్చారా అని ప్రశ్నించారు.  అనంతరం రుక్మాపూర్ ఉపసర్పంచ్ రామచంద్రం తో పాటు వార్డ్ మెంబర్లు లక్ష్మయ్య, కాశీ రాములు, వెంకమ్మ, చంద్రకళ, మమత, తులసి, కో ఆప్షన్ మెంబర్ కవిత, వడియారం వార్డ్ మెంబర్  నర్సింలు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజెపీలో జాయిన్ అయ్యారు. 

తొగుట : ఒక్కపుడు దొమ్మట పేరు మీద నియోజక వర్గం ఉండేదని, వచ్చే ఎన్నికల్లో గెలిచిన వెంటనే దొమ్మట గ్రామాన్ని మండల కేంద్రంగా మారుస్తామని ఎమ్మెల్యే రఘునందన్​ రావు హామీ ఇచ్చారు. దౌల్తాబాద్ మండలంలోని దొమ్మట, ముబారస్ పూర్, గజులపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండలపార్టీ అధ్యక్షుడు కిషన్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.