పింఛన్లు రావాలంటే బీఆర్ఎస్​ పోవాలే: రఘునందన్​రావు

పింఛన్లు రావాలంటే బీఆర్ఎస్​ పోవాలే: రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: వృద్దులు, వింతువులు, వికలాంగులకు పింఛన్లు రావాలంటే బీఆర్ఎస్​ ప్రభుత్వం పోవాలని ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. శనివారం మండలంలోని పెద్దగుండవెళ్లి, మిరుదొడ్డి మండలం ధర్మారం, ఆరెపల్లి, లక్ష్మి నగర్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే పేదలు, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు వస్తాయని అందరూ ఆశించారు కానీ ఒక్క కేసీఆర్​ కుటుంబంలోనే వెలుగులు నిండాయని ఆరోపించారు.

బీఆర్ఎస్​కు ఓటేయ్యకుంటే పింఛన్లు, డబుల్​ బెడ్రూమ్​లు రావని నాయకులు బెదిరిస్తున్నారని, ఇలాంటి ఊకదంపుడు మాటలకు ఎవ్వరూ భయపడొద్దన్నారు. గ్రామాల్లో దళిత, బీసీ బంధు కేవలం బీఆర్ఎస్​ లీడర్లకే వచ్చాయని మిగతావాళ్లకు ఎందుకివ్వరో నిలదీయాలని ఎమ్మెల్యే కోరారు. నియోజకవర్గంపై మంత్రి హరీశ్​రావు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. 17 శాతం ఉన్న మాదిగ సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేని దద్దమ్మ సీఎం కేసీఆర్​అన్నారు.

తాను గెలవగానే రాష్ట్ర అసెంబ్లీలో రేషన్​ కార్డు, ఆసరా పింఛన్ల కోసం కోట్లాడి దుబ్బాక ప్రతిష్టను పెంచానని పేర్కొన్నారు.  మిరుదొడ్డి మండలం ధర్మారం నుంచి దుంపలపల్లి మీదుగా బల్వంతాపూర్​ వరకు రూ.4 కోట్ల కేంద్ర నిధులతో తారు రోడ్డు వేయించానని చెప్పారు. మరొక్కసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.