
సిద్దిపేట : దుబ్బాకలో ఉప ఎన్నిక సందర్భంగా అన్ని పార్టీల ప్రచారాలు ఊపందుకున్నాయి. శనివారం సిద్ధిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కు మద్దతుగా రాజాసింగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాకలో ఒక యుద్ధం జరుగుతోందన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ తరపున తానొక్కడినే ఉన్నానని, తనతోపాటు రఘునందన్‌ను అసెంబ్లీకి పంపిస్తే.. ధర్మ ద్రోహులను బట్టలు లేకుండా తిప్పితిప్పి కొడతారని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. దుబ్బాక అభివృద్ధి రఘునందన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. దుబ్బాకలో ఎన్ని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టించారో హరీష్ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకే ఇళ్లు ఇచ్చారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలంతా కష్టపడి రఘునందన్ రావును గెలిపిస్తే దుబ్బాక లో అభివృద్ధి జరుగుతుందని, ఆయన నా వెంట ఉంటే యావత్ తెలంగాణ లోనే బీజేపీ జెండా ఎగిరిస్తామని రాజాసింగ్ అన్నారు