
నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ, మండలిలో గవర్నర్ తమిళి సై ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు.. అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రతిపాదించగా.. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బలపరిచారు.
ధరణి పోర్టల్ రద్దు చేసి భూమాత పోర్టల్ తెస్తామని సభలో చెప్పారు రామ్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు సేవకులన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేవలం రైతులకు10 నుంచి 12 గంటలే ఉచిత కరెంట్ ఇచ్చారని చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ కు కట్టుబడి ఉన్నామన్నారు. బెల్టుషాపులను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. మూతపడిన స్కూళ్లను తెరిపిస్తామని చెప్పారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ. 10లక్షలకు పెంచామన్నారు. మహిళలకు ఫించన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షలు.. గృహజ్యోతి స్కీం కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో సమస్యలపై రేవంత్ రెడ్డి అలుపెరగని పోరాటాం చేశారని తెలిపారు.