- ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల టౌన్, రాయికల్, వెలుగు: జగిత్యాల నియోజకవర్గ విద్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే, కొందరు రాజకీయ లబ్ధి కోసం ధర్మదీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విమర్శించారు. సోమవారం జగిత్యాల జిల్లాకేంద్రం మోతే రోడ్డులోని పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ చల్గల్ ప్రాంతంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నదే తన కోరిక అని, దీనిపై ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశామన్నారు.
పేద విద్యార్థులకు మేలు చేసే నవోదయ స్కూల్‌ను జగిత్యాలలో కాకుండా కోరుట్లకు మంజూరు చేయించడంలో ఎంపీ అరవింద్ ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. అంతకుముందు రాయికల్ మండలం శ్రీరాంనగర్, ఉప్పుమడుగు కేజీబీవీలను సందర్శించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, విండో చైర్మన్ రాజరెడ్డి, సర్పంచులు రాధిక శ్రీరాం, కొత్తకొండ రోజా నవీన్, పాల్గొన్నారు.
