బాలికపై అఘాయిత్యం కేసులో ఎమ్మెల్యే కొడుకు అరెస్టు

బాలికపై అఘాయిత్యం కేసులో ఎమ్మెల్యే కొడుకు అరెస్టు
  • పోక్సో కేసు నమోదు చేశామన్న హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్​
  • ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లే
  • పక్కా ప్లాన్​ ప్రకారమే అత్యాచారం
  • పెద్దమ్మగుడి వెనక ఇన్నోవా కారులో అఘాయిత్యం
  • అమ్నీషియాలో బెంగళూరుకు చెందిన మైనర్​ పార్టీ 
  • పబ్​లోనే అమ్మాయిలతో నిందితుల వెకిలి చేష్టలు
  •  జువనైల్​ హోమ్​కు మైనర్లు

హైదరాబాద్​, వెలుగు: జూబ్లీహిల్స్​లో బాలికపై అఘాయిత్యం కేసులో ఎమ్మెల్యే కొడుకును పోలీసులు అరెస్ట్​చేశారు. అతడిని ఆరో నిందితుడిగా చేర్చి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సాదుద్దీన్​ మాలిక్​(18), మరో నలుగురిని ఇప్పటికే అరెస్ట్​ చేశారు. ఈ కేసు వివరాలను మంగళవారం హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సీవీ ఆనంద్​ వెల్లడించారు. ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లేనని చెప్పారు. మైనర్లు అయినందువల్ల వారి పేర్లను బయటకు చెప్పడం లేదని పేర్కొన్నారు. కేసును పారదర్శకంగా దర్యాప్తు చేశామని, నిందితులకు 20 ఏండ్ల జైలు, జీవిత ఖైదు, మరణశిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

పబ్​లోనే పక్కా ప్లాన్​ 
బెంగళూరుకు చెందిన ఓ మైనర్​‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్​లోని పబ్​లో ఓ పార్టీ​ నిర్వహించాలనుకున్నాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి యుఫోరియా కమింగ్​ సూన్​ అంటూ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ పెట్టాడు. ఉస్మాన్​ అలీ ఖాన్​ అనే వ్యక్తి అందుకోసం అమ్నీషియా పబ్​ను బుక్​ చేశాడు. నో లిక్కర్, నో స్మోకింగ్​ పర్మిషన్​తో ఈవెంట్​కు అనుమతిచ్చారు. పార్టీకి వచ్చేవారికి ఒక్కొక్కరికి రూ.1,200 చొప్పున ఎంట్రీ ఫీజును ఫిక్స్​ చేశారు. బాధితురాలు కూడా రూ.1,300 ఎంట్రీ టికెట్​ తీసుకుని.. ఫ్రెండ్​తో కలిసి గత నెల 28న మధ్యాహ్నం 1.10 గంటలకు పబ్​కు వెళ్లింది. 1.15 గంటల వరకు ఇద్దరూ డ్యాన్స్​ చేశారు. బాధితురాలికి అక్కడే మరో ఫ్రెండ్​ కలిసింది. నిందితులు అంతా 3 గంటల ప్రాంతంలో పబ్​కి వచ్చారు. అమ్మాయిలతో వెకిలి చేష్టలు చేయాలని ముందుగానే ప్లాన్​ చేసుకుని పబ్​లోకి అడుగుపెట్టారు. అనుకున్నట్టే అమ్మాయిలతో పక్కా ప్లాన్​ ప్రకారం అసభ్యంగా ప్రవర్తించారు.  
ప్రైవేట్​ పార్ట్స్​పై టచ్​ చేశారు  
పబ్​లో 3.15 గంటలకు బాధిత బాలికను ఓ మైనర్​ కలిశాడు. ఆ తరువాత సాదుద్దీన్​ కూడా అక్కడికి వచ్చాడు. 5.10 గంటల ప్రాంతంలో ఇద్దరు కలిసి బాధితురాలితో పాటు ఆమె ఫ్రెండ్​తో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో మరో నలుగురు మైనర్లు కూడా అక్కడికి వచ్చారు. వేధింపులు ఎక్కువ కావడంతో 5.43 గంటలకు బాధిత బాలిక సహా మరో అమ్మాయి పబ్​ నుంచి బయటకు వచ్చేశారు. వాళ్లతో పాటే బయటకు వచ్చిన నిందితులు.. బాలికను ట్రాప్​ చేశారు. బెంజ్​ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. మరో నలుగురు ఇన్నోవా కారులో వెనకే వెళ్లారు. బెంజ్​ కారులో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తూ, ప్రైవేట్​ పార్ట్స్​ను టచ్ చేశారు. 
పెద్దమ్మగుడి సమీపంలో దారుణం
అదేరోజు 5.51 గంటలకు జూబ్లీహిల్స్​ రోడ్​ నంబర్​ 36లోని కాన్సు బేకరీకి వెళ్లారు. కొద్ది సేపటి తరువాత సాయంత్రం 5.57కి ఇన్నోవా, బెంజ్‌‌‌‌‌‌‌‌ కార్లలో అక్కడి నుంచి బయలుదేరారు. వారితో పాటు ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నా.. ఏదో ఫోన్​ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం 6.15 గంటలకు బేకరీ నుంచి ఇన్నోవా వెళ్లిపోయింది. బాధితురాలితో పాటు సాదుద్దీన్​, నలుగురు మైనర్లు వెళ్లారు. పెద్దమ్మ టెంపుల్​ వెనుక ఉన్న ఖాళీ ప్రాంతంలో కారును పార్క్​ చేసి.. ఇన్నోవాలోనే ఒకరి తర్వాత ఒకరు ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 7.31 గంటలకు ఇన్నోవాలో పబ్​కు తిరిగొచ్చి బాధితురాలిని వదిలి వెళ్లిపోయారు. రాత్రి 7.53 గంటలకు బాధిత బాలికను తండ్రి ఇంటికి తీసుకెళ్లాడు. 

నిందితులను గుర్తుపట్టలేని స్థితిలో బాలిక
బాధిత బాలిక స్టేట్​మెంట్​, తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు సాగింది. బాధితురాలు నిందితులెవరినీ గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. అత్యాచారం గురించి బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పలేదు. మెడ ఇతర ప్రాంతాల్లో గాయాలను చూసి తల్లిదండ్రులు అడిగితే వివరాలు చెప్పింది. 31న బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న గ్యాంగ్​రేప్​ కింద జూబ్లీహిల్స్​ పోలీసులు కేసు నమోదు చేశారు. 2వ తేదీన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశారు. 3వ తేదీన సాదుద్దీన్​ మాలిక్​(18) మరో నిందితుడిని అరెస్ట్​ చేశారు. ఆ తరువాత మరో ఇద్దరు మైనర్లను అరెస్ట్​ చేశారు. బెంజ్​ కారులో ఫొటోలు, వీడియోల ఆధారంగా ఎమ్మెల్యే కొడుకును మంగళవారం అరెస్ట్​ చేశారు. మైనర్లను జువెనైల్​ హోంకు తరలించారు.