ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కులం పేరుతో తిడుతున్నడు : బొంతు శ్రీదేవి

ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కులం పేరుతో తిడుతున్నడు : బొంతు శ్రీదేవి
  • ఉప్పల్ సెగ్మెంట్​లో బయటపడ్డ టీఆర్ఎస్​ నేతల మధ్య విభేదాలు
  • కుషాయిగూడలో మోడ్రన్ దోబీఘాట్​ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
  • ఆయన వెళ్లిపోయాక మళ్లీ ప్రారంభించిన మాజీ మేయర్

కుషాయిగూడ,వెలుగు: ఉప్పల్ సెగ్మెంట్ పరిధి చర్లపల్లి డివిజన్​లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు  ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సమాచారం ఇవ్వట్లేదని.. ప్రొటోకాల్ పాటించట్లేదంటూ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపించారు. ఎమ్మెల్యే తనను వేధిస్తున్నాడని.. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆమె కంటతడి పెట్టారు. కుషాయిగూడలో మోడ్రన్ దోబీఘాట్​ను ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.

మల్లారెడ్డి మాట్లాడి వెళ్లిపోయిన కొద్దిసేపటికి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆయన భార్య బొంతు శ్రీదేవితో కలిసి అక్కడికి వచ్చారు. ఆమెతో కలిసి మరోసారి దోబీఘాట్​ను ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ శ్రీదేవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  దోబీఘాట్ ప్రారంభోత్సవానికి మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్ వస్తున్నారనే సమాచారంతో తాను ఉదయం 8.50 గంటలకే  ఇక్కడికి వచ్చానని చెప్పారు. 10.30కు ప్రారంభోత్సవం ఉంటుందని భావించి తాను బయటకు వెళ్లానన్నారు.  కానీ 10 గంటలకే మంత్రి మల్లారెడ్డి వచ్చి దోబీఘాట్​ను ప్రారంభించారన్నారు. ఎమ్మెల్యే సుభాష్​ రెడ్డి  తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. డివిజన్​లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా తనకు చెప్పట్లేన్నారు. డివిజన్​లో సమస్యలను తెలుసుకునేందుకు తాను పర్యటిస్తుంటే..  కార్యకర్తల దగ్గర కులం పేరుతో ఎమ్మెల్యే తనను తిడుతున్నాడని, అసభ్యంగా మాట్లాడుతున్నాడని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే బేతి సుభాష్​ రెడ్డి గురించి సీఎం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.