బతుకమ్మ చీరలు ఇష్టముంటే తీసుకోండి లేకుంటే వదిలేయండి

బతుకమ్మ చీరలు ఇష్టముంటే తీసుకోండి లేకుంటే వదిలేయండి
  • బతుకమ్మ చీరల పంపిణీలో జనంపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ అసహనం

గంగాధర, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలు మంచిగ లేవని, పాత చీరలే ఇస్తున్నారని నిలదీసిన మహిళలపై చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఇష్టముంటే తీసుకోండి, లేకపోతే వదిలేయండి.. మీకు రూ. పదివేల చీర కట్టుకోవాలని ఉంటే కొనుక్కొని కట్టుకోండి” అంటూ మండిపడ్డారు. శనివారం కరీంనగర్​ జిల్లా గంగాధర ఎంపీడీవో ఆఫీసులో చీరల పంపిణీని ఎమ్మెల్యే చేపట్టారు. ‘‘గివేం చీరలు.. ఏమన్న మంచిగున్నయా? ” అని మహిళలు ఎమ్మెల్యే రవిశంకర్​ను ప్రశ్నించారు. సర్కారు ఇస్తున్న ప్రకటనల్లోని చీరలకు, మాకు పంపిణీచేస్తున్న చీరలకు చాలా తేడా ఉందన్నారు. దీంతో ఆయన.. బతుకమ్మ పండుగ సందర్భంగా ఓ అన్నగా కేసీఆర్ ఈ చీరలు పంపించారని మహిళలకు సర్ది చెప్పబోయారు. దీంతో మహిళలు.. ‘‘అన్న అయితే.. తోడబుట్టిన చెల్లెళ్లకు ఇసుంటి పాత చీరలే ఇస్తారా?”అని నిలదీశారు. ‘‘సర్కారు ప్రేమ పూర్వకంగా ఇచ్చిన చీరలను ప్రేమ పూర్వకంగానే తీసుకోవాలి.  ఎవరో ఏదో చెబితే ఇక్కడకు వచ్చి రాద్ధాంతం చేయొద్దు. గతంలో పాలించినోళ్లు ఇలాంటి పథకం పెట్టకపోయినా ఎవరూ ఏనాడూ అడగలేదు కదా..!” అని ఎమ్మెల్యే అనగానే.. ‘‘మంచిగ లేని చీరలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుడు దేనికి. ఏం లాభం?” అని మహిళలు ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అసహనానికి గురయ్యారు.