- ఎమ్మెల్యే తలసాని డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: ఎంతో ఘన చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని ‘లష్కర్ కార్పొరేషన్’గా ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు మున్సిపాలిటీలుగా ఉండేవని, కాలక్రమేణా జనాభా పెరగడంతో 100 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడిందన్నారు.
2014 తర్వాత బీఆర్‌ఎస్ హయాంలో 150 డివిజన్లుగా విస్తరించిందని వివరించారు. ప్రస్తుతం ఓఆర్‌ఆర్ లోపలి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి 300 డివిజన్లు ఏర్పాటు చేశారన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మూడు కార్పొరేషన్ల ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నందున లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. దీక్షలో సాయిబాబా, బన్సీలాల్‌పేట డివిజన్ కార్పొరేటర్ కుర్మ హేమలత, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
